
అన్నప్రసాద భవనానికి విరాళాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన బెల్లంకొండ కృష్ణమూర్తి, గొడవర్తి వరలక్ష్మి, కుటుంబ సభ్యులు రూ.1,01,116, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన దేవిశెట్టి నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.25,116 అందజేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు స్వామివారి చిత్రపటాలను దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు.
అడవి బిడ్డల ఆరోగ్యంపై
దృష్టి పెట్టాలి
అమలాపురం టౌన్: అడవి బిడ్డల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా అడవి ఆడబిడ్డల ప్రసవ సమయ మరణాలను నిరోధించాలని సూచించారు. అమలాపురంలో ఎమ్మెల్సీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సందర్భంగానైనా ప్రసవ మరణాలు లేకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గ దర్శకాల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతీ గూడెం, తాండాల్లో సంచార వైద్యులను నియమించి ప్రసవ మరణాలు, పిల్లల అకాల మరణాలు పూర్తిగా అరికట్టాలని సూచించారు. ఆదివాసీలపై జరుగుతున్న అమానుష దాడులను ఆపాలన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో 3 లక్షల వ్యవసాయ పట్టాలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఏమీ చేయకపోగా అడవి బిడ్డల సంక్షేమం గురించి మాట్లాడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పద్మావతీదేవికి బంగారు
మామిడి పిందెల హారం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి సన్నిధిలో కొలువైన పద్మావతీదేవికి అదే గ్రామానికి చెందిన తటవర్తి లక్ష్మీనారాయణ, అతని కుటుంబ సభ్యులు బంగారు మామిడిపిందెల హారం సమర్పించారు. హారం విలువ సుమారు రూ.65 వేలు ఉంటుంది. ఆ హారాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్ సత్యమూర్తికి అందజేశారు. హారానికి అర్చకులు సంప్రోక్షణ చేసి పూజలు జరిపించి అమ్మవారికి అలంకరించారు. కొత్తపేటకు చెందిన మల్లవరపు వెంకటసత్యనారాయణ, సత్యవతి దంపతులు రూ.10 వేలు, నిడదవోలుకు చెందిన కాపా రామకృష్ణ, విజయలక్ష్మి దంపతులు రూ.10 వేలు, విశాఖపట్నానికి చెందిన డాక్టర్ బడే నాగ సురేష్, కాంతిప్రియ దంపతులు రూ.10,116 స్వామివారికి విరాళంగా అందించారు. ఈ విరాళాలను ఆలయ ఉద్యోగులకు అందించారు. దాతలకు అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు ఈఓ వి.సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
ఉచిత బస్సు పేరిట
మహిళలకు మోసం
ఉప్పలగుప్తం: చంద్రబాబు మహిళలను ఉచిత బస్సు పేరుతో మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి ఆరోపించారు. ఆదివారం ఆమె నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఉచిత బస్సుతో మహిళలు రాష్ట్రమంతా చుట్టేయచ్చు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్డీనరీ బస్సులు వేసి మమ అనిపించుకుంటారా అని ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వ లగ్జరీ బస్సుల్లో తిరగాలని ఉండదా అని ప్రశ్నించారు. మోసపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని మహిళలను మోసం చేస్తే దానికి తగిన గుణపాఠం రాబోయే ఎన్నికల్లో చూపిస్తారన్నారు.

అన్నప్రసాద భవనానికి విరాళాలు

అన్నప్రసాద భవనానికి విరాళాలు