
కొత్త బీటీ రోడ్డుకు తూట్లు
ఆక్రమ మట్టి రవాణాతో చిందరవందరగా మారిన బీటీ రోడ్డు
అక్రమ మట్టి రవాణాతో చిందరవందరగా మారిన బీటీ రోడ్డు
సాక్షి, అమలాపురం: మట్టి మాఫియా దౌర్జన్య వైఖరికి అధికారుల నిర్లక్ష్యం తోడై కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డు తూట్లు పడిపోయింది. మండల కేంద్రమైన ఉప్పలగుప్తం పేరాయిచెరువు దళితవాడలో ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డు మీదుగా కొంతమంది అక్రమంగా మట్టిని తరలిస్తూ నెలలు గడవకుండానే తూట్లు పొడుస్తున్నారు. ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా మారి సాన్థికులు ఇబ్బందులకు గురికావడంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్‌లో అప్పటి మంత్రి పినిపే విశ్వరూప్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఇంతలో ఎన్నికలు రాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇటీవల బీటీ రోడ్డు పనులను పూర్తి చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర స్థాయి నేతకు అనుచరుడని అని చెప్పకుంటూ గ్రామంలో ఇష్టారాజ్యంగా వారంరోజులుగా ఈ రోడ్డు మీదుగా యథేచ్ఛగా మట్టి రవాణా సాగిస్తున్నాడని స్థానికులు అరోపిస్తున్నారు. మట్టి రవాణా చేయడంతో తారు రోడ్డంతా మట్టి రోడ్డుగా మారుతోందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున నుంచి కురిసిన వానకు ఆ మట్టి రోడ్డుపై ప్రయాణించేవారు జారి పడి ప్రమాదాలకు గురయ్యారు. ట్రాక్టర్‌కు నాగలి బ్లేడు తగిలించి ఆ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకొనేవారు లేరు. ప్రజాధనంతో వేసిన రోడ్డుకు నెలలు గడవకుండానే తూట్లు పొడుస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.