
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల వద్ద నుంచి వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కారం చేస్తారన్నారు. పీజీఆర్‌ఎస్ మూడు రెవెన్యూ డివిజన్లు ,మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలో జరుగుతుందన్నారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చునన్నారు.
సంకీర్తన భవనం ప్రారంభం
అమలాపురం రూరల్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, రాజమహేంద్రవరం ఇస్కాన్ ఆధ్వర్యంలో అమలాపురం మండలం జనుపల్లిలో నూతన నిర్మించిన సంకీర్తన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ భవన ప్రారంభోత్సవానికి ఇస్కాన్ రాజమహేంద్రవరం మందిర చైర్మన్ శ్రీసత్య గోపీనాథ్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన భక్తులకు ఉద్దేశించి ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. కోనసీమలో తొలిసారిగా ఇస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. నితాయి, గౌర చంద్రులకు మహాపుష్పా భిషేకం, 54 రకాల వంటలతో మహానైవేద్యం సమర్పించారు. శనివారం నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు వేడుకలు కొనసాగుతాయని ఇస్కాన్ అమలాపురం మేనేజర్ శివానంద నిమయి దాస్ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. మండేలా బాబి, వాకపల్లి స్వామినాయిడు, ఇస్కాన్ సండే స్కూల్ టీచర్ సత్యకళ, నిమయి దాస్ భక్త బృందం, రావులచెరువు రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.