శృతి తప్పిన రుతురాగం | - | Sakshi
Sakshi News home page

శృతి తప్పిన రుతురాగం

Aug 10 2025 6:22 AM | Updated on Aug 10 2025 6:22 AM

శృతి

శృతి తప్పిన రుతురాగం

48 మండలాల్లో వర్షాభావం

ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు జిల్లాలో ఇప్పటి వరకు లోటు వర్షమే కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో సగటు కన్నా 22.65 మిల్లీ మీటర్లు, కాకినాడ జిల్లాలో 22.19 మిల్లీ మీటర్లు, కోనసీమ జిల్లాలో 32.75 మిల్లీమీటర్ల వర్షం పాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది కోనసీమలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అడపాదడపా వర్షాలు పడుతున్నా భారీ వర్షానికి జిల్లా వాసులు ముఖం వాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తం మూడు జిల్లాలో 62 మండలాలు ఉండగా, ఏకంగా 48 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో తూర్పు గోదావరి జిల్లాలో 19 మండలాలు ఉండగా, 13 మండలాల్లో లోటు వర్షం పడింది. కాకినాడ జిల్లా 21 మండలాలకు 14 మండలాల్లో లోటు వర్షం కురవగా, కోనసీమ జిల్లాలో 22 మండలాలకు ఏకంగా 21 మండలాల్లో వర్షాభావం నెలకొంది. కోనసీమ జిల్లాలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. రెండు మూడేళ్లుగా ఒక్క ఆగస్టు మినహా జూన్‌ నుంచి అక్టోబరు నెల వరకు సగటు కన్నా అధిక వర్షం నమోదు కావడం గమనార్హం.

ఉమ్మడి తూర్పుపై నైరుతి శీతకన్ను

48 మండలాల్లో లోటు వర్షం నమోదు

ఖరీఫ్‌కు అడుగడునా అవాంతరం

5.97 లక్షల ఎకరాల ఆయకట్టులో

4.56 లక్షల ఎకరాలలోనే సాగు

గోదారి నీటి రాక సైతం అరకొర

గత ఏడాది ఈ సమయానికి

1,895 టీఎంసీల ఇన్‌ఫ్లో

ఈ ఏడాది వచ్చింది 937.420 టీఎంసీలే

సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు రాకుండానే.. మే నెలలో మండు వేసవిలో వర్షాలు కురిశాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అన్నదాతలు, ప్రజలు ఆశించారు. కానీ వానచుక్క జాడ లేదు. గోదావరికి జూలై నెలలో అరుదుగా వరద వస్తోంది. ఇలా వచ్చిన ఏడాది ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరదలు రావడం పరిపాటి. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా జూలైలో గోదావరికి రెండుసార్లు వరద పోటు తగిలినా పెద్దగా ఇన్‌ ఫ్లో లేకుండా పోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ఉరవడి తగ్గిపోయింది. ఇక రైతుల ఆశల పంట ఖరీఫ్‌ మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. గోదావరి డెల్టాలోనే నీరందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. ఉమ్మడి తూర్పులో వర్షం జాడ లేకుండా పోయింది. జూన్‌, జూలై నెలలతో పాటు ఆగస్టు నెలలో ఇప్పటి వరకు లోటు వర్షం నమోదైంది. వారంలో ఒక రోజు ఒక మోస్తరు వర్షం కురిస్తే మిగిలిన ఆరు రోజులు వేసవిని తలపిస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల దాటికి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అరకొరగానే గోదావరి నీరు..

ఈ ఏడాది గోదావరి ఇన్‌ ఫ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సగం కూడా ఇన్‌ ఫ్లో లేదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ నాటికి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఇన్‌ ఫ్లో 1,895.571 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి డెల్టాలో మూడు ప్రధాన కాలువలకు 47.465 టీఎంసీలు నీరు విడుదల చేయగా సముద్రంలోకి 1,848.106 టీఎంసీల మిగులు జలాలను వదిలారు. ఇదే రోజు మూడు డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, సముద్రంలోకి 7,33.886 క్యూసెక్కుల నీరును విడిచి పెట్టారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 937.420 టీఎంసీల ఇన్‌ ఫ్లో నమోదైంది. దీనిలో 61.33 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేయగా 876.087 టీఎంసీలు సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం పంట కాలువలకు 14,700 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 1,18,480 క్యూసెక్కుల మిగులు జలాలు మాత్రమే సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గత ఏడాది జులై నెలలో భారీ వరద చోటు చేసుకోగా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలోనూ గోదావరికి పెద్ద వరదలు వచ్చాయి. ఇన్‌ ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది రబీకి ఢోకా లేకుండా పోయింది. కానీ ఈ ఏడాది జూలై నెలలో రెండుసార్లు గోదావరి స్వల్ప వరద మాత్రమే వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రబీకి నీటి ఎద్దడి తప్పదని రైతులలో ఆందోళన నెలకొంది.

మానవ విధ్వంసం వల్లే

వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరు లు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయువ్యంగా రావాల్సిన మే ఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీని వల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీని వల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడడం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షా లు రావాలంటే సముద్ర ఉష్ణోగ్రతలలో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతు పవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడడం లేదు.

– డాక్టర్‌ పి.కృష్ణకిశోర్‌,

కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు,

అమలాపురం

నింగికీ నేలకీ ఉమ్మడి అతిథులు మేఘమాలలు. భూమ్యాకాశాల పలకరింపులు బాగున్నపుడు ఉబ్బి తబ్బిబ్బై ఎంతో ఆర్థ్రతతో చక్కని చిరునవ్వలు చిందిస్తూ చిటపటమంటూ చినుకులను చిమ్మేస్తాయి. అచ్చు మన ఇంటికి వచ్చిన అతిథులకు మనం ఇచ్చే ఆతిథ్యం నచ్చినపుడు ఎంతో సంతోషంతో సుఖీభవ అని ఆశీర్వదించి సెలవుతీసుకున్నట్టు. అదే ఏ మనస్పర్థలో వచ్చి ఆ ఇంటి వారు ఎడమొహం పెడమొహంగా ఉంటే ఏ అతిథైనా ఎప్పుడు వెళ్లిపోదామా అని ఎదురుచూస్తుంటాడు. ఇదే వాతావరణం భూమ్యాకాశాలు, మేఘమాలల మధ్య సాగుతోంది. రుతు గమనాలు మారిపోవడం.. భూగతులు క్రమం తప్పడం.. ఇందుకు పుడమి పుత్రులు చాలా వరకు కారణం కావడం.. వగైరా వగైరా. బిడ్డలకు క్రమశిక్షణ నేర్పాలనుకుంటున్నాయో ఏమో.. సకాలంలో మేఘాలు వర్షించక.. వర్షించిన కాలం పంటలకు అకాలమై నిలదొక్కుకోలేక.. అసలు ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఆకాశంవైపు చూస్తున్నాడు అన్నదాత. నీ తప్పిదానికి నాది బాధ్యత కాదన్నట్టు మేఘాలు ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా సాగులో అస్థిరత ఏర్పడుతోంది.

మందకొడిగా ఖరీఫ్‌

కోనసీమతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ నత్తనడకన సాగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలలో మొత్తం 5,97,847 ఎకరాలలో ఖరీఫ్‌ సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,56,067 ఎకరాలలో మాత్రమే నాట్లు పడడం గమనార్హం. అంటే మొత్తం సాగులో 76 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. కోనసీమ జిల్లాలో 1,63,999 ఎకరాలకు 1,23,117 ఎకరాల్లో (70 శాతం) నాట్లు పడగా, తూర్పుగోదావరి జిల్లాలో 1,99,867 ఎకరాలకు 1,74,638 ఎకరాలలో (87 శాతం), కాకినాడ జిల్లాలో 2,33,981 ఎకరాలకు 1,58,312 ఎకరాలు (67 శాతం) మాత్రమే నాట్లు వేశారు. కాకినాడ జిల్లాలో ఏలేరు, పంపా, పిఠాపురం బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ)తోపాటు పలు ప్రాంతాల్లో ఖరీఫ్‌ మందకొడిగా సాగుతోంది.

శృతి తప్పిన రుతురాగం1
1/4

శృతి తప్పిన రుతురాగం

శృతి తప్పిన రుతురాగం2
2/4

శృతి తప్పిన రుతురాగం

శృతి తప్పిన రుతురాగం3
3/4

శృతి తప్పిన రుతురాగం

శృతి తప్పిన రుతురాగం4
4/4

శృతి తప్పిన రుతురాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement