
వాడవాడల నుంచి వాడపల్లికి..
● వేలాదిగా భక్తజనం రాక
● స్వామివారి ఆదాయం
రూ.50.35 లక్షలు
కొత్తపేట: కోనసీమ తిరుమల.. ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి క్షేత్రం శనివారం వేలాది మంది భక్తజనంతో కిటకిటలాడింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు, వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశాక కోరిన కోర్కెలు తీరిన అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకస్వాముల నుంచి ఆశీర్వాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకూ వివిధ మార్గాల ద్వారా దేవస్థానానికి రూ. 50,35,081 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎస్ రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి ఆలయం ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లికి బస్సు సర్వీసులను నడిపింది.