
విద్యుత్ తీగలపై పడి యువకుడి మృతి
యానాం: స్థానిక గౌతమీ గోదావరి రాజీవ్ రివర్ బీచ్ వద్ద ఉన్న కూనపురెడ్డి కాంప్లెక్స్‌లో లాడ్జిపై భాగం నుంచి గురువారం అర్ధరాత్రి విద్యుత్ తీగలపై పడిన యువకుడు మృతి చెందినట్లు ఎస్సై పునీత్‌రాజ్ తెలిపారు. మృతి చెందిన యువకుడు ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామ నివాసి చింతా గురుమూర్తి (22)గా గుర్తించామన్నారు. మృతుడు ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడని వివరించారు. అర్ధరాత్రి వేళ విద్యుత్ తీగలపై యువకుడు పడి ఉన్నాడని సమాచారం అందడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అక్కడకు వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. యానాం పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బందికి ఆయన సమాచారం అందించారు. వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. ముగ్గురు యువకులు గురువారం రాత్రి లాడ్జిలో దిగి మద్యం తాగారన్నారు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. యానాం జీజీహెచ్‌కు మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పునీత్‌రాజ్ తెలిపారు.