
గొప్పలు కాదు.. సాధించిన పనులు చెప్పండి
అమలాపురం టౌన్: గొప్పలు చెప్పడం కాకుండా గడిచిన 14 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్రం నుంచి ఇప్పటి వరకూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్ని నిధులు తెచ్చారో, ఏం పనులు చేశారో వెల్లడించాలని జనసేన పార్టీ నేతలను వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ ప్రశ్నించారు. అమలాపురంలో కిషోర్ శుక్రవారం మాట్లాడుతూ ముఖ్యంగా పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ ప్రశ్నకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శంకుస్థాపనలు చేసి పనులు మొదలు పెట్టడం, తదితర అభివృద్ధి పనులకు కొనసాగింపుగా కేంద్రం నుంచి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రిని ఒప్పించి ఏ మేరకు నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఇప్పటికై నా పొగడ్తలు ఆపి వాస్తవాలు మాట్లాడాలని జనసేన నేతలకు కిషోర్ సూచించారు.
రెవెన్యూ శాఖలో
ఏడుగురికి డిప్యుటేషన్లు
అమలాపురం రూరల్: పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా జిల్లా రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్ల క్యాడర్‌లో పనిచేస్తున్న వారికి డిప్యుటేషన్లు వేశారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఏడుగురికి డిప్యుటేషన్లు నియమిస్తూ ఇన్‌చార్జి డీఆర్‌ఓ, ఆర్డీవో కొత్త మాధవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముమ్మిడివరం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయకుమారిని అమలాపురం ఆర్డీఓ కార్యాలయ డీటీగా, కాట్రేనికోన డిప్యూటీ తహసీల్దార్ ఐ.జగదీష్‌ను ముమ్మిడివరం డీసీఎస్‌ఓకు వేశారు. పోలవరం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న వి.రవికిరణ్‌ను కాట్రేనికోనకు వేశారు. ముమ్మిడివరంలో (రీ–సర్వే) విభాగం డిప్యూటీ తహసీల్దార్ జి.లలితను ఉప్పలగుప్తంకు, ఉప్పలగుప్తం డిప్యూటీ తహసీల్దార్ జీవీఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యంను అయినవిల్లికి, ముమ్మిడివరం సీనియర్ అసిస్టెంట్ ఎం.దుర్గాశ్రీనివాస్‌ను రాజోలు డీటీగా వేశారు.
వారాహిగా వనదుర్గమ్మ
అన్నవరం: రత్నగిరిపై వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారు వారాహిమాత అలంకరణలో కనువిందు చేశారు. రెండు చేతుల్లో శంఖు చక్రాలు, మరో చేతిలో శూలం ధరించి మరో చేయి అభయహస్తంగా చూపుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహజపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణలు నిర్వహించారు.

గొప్పలు కాదు.. సాధించిన పనులు చెప్పండి