నోటిఫై చేస్తేనే లాభసాటి | - | Sakshi
Sakshi News home page

నోటిఫై చేస్తేనే లాభసాటి

Aug 8 2025 8:52 AM | Updated on Aug 8 2025 8:52 AM

నోటిఫ

నోటిఫై చేస్తేనే లాభసాటి

సాక్షి, అమలాపురం: కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటలలో అంతర పంటగా... అదనపు ఆదాయాన్ని ఇచ్చేదిగా.. అధికంగా ఆకురాల్చే గుణంతో తోటల్లో టన్నుల కొద్దీ సేంద్రియ కర్బనాన్ని అందిస్తూ కోకో సాగు రైతులకు కాసుల వర్షం కురిపించాల్సి ఉంది. కాని అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కోకో గింజలకు ధర దక్కక పోవడం, పంటల బీమా ధీమా లేకపోవడం, పంట నష్టపోతే పెట్టుబడి రాయితీ అందక రైతులు నష్టపోయే పంటగా కోకోకు ముద్రపడి పోయింది. ఉద్యాన పంటలలో లాభసాటి పంటగా ఉండాల్సిన కోకో పంటను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో ఇది నష్టాల పంటగా మారిపోతోంది.

కోనసీమ గింజలకు అంతర్జాతీయ డిమాండ్‌

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోకో పంట ప్రధాన ఉద్యాన పంటలలో ఒకటిగా మారింది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటగా రైతులు కోకోను సాగు చేస్తున్నారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో కోకోను సాగు చేస్తున్నారని అంచనా. ప్రపంచంలో నాణ్యమైన గింజలను ఉత్పత్తి చేసే గనా దేశం కన్నా మేలైన గింజలను గోదావరి జిల్లాల రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లాలో తయారయ్యే గింజకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది.

ఎకరాకు దిగుబడి ఏడాదికి రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు ఉంటుంది. కొబ్బరికి ఇటు ఆయిల్‌పామ్‌ సాగు చేసే రైతులకు కోకో మీద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తోంది. పెట్టుబడులు పోను ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. రెండేళ్ల క్రితం ధర కేజీ రూ.900 వరకు చేరింది ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. అంతకుముందు రూ.160 నుంచి రూ.240 వరకు ఉండేది. ఇటీవల కాలంలో గింజల ధర రూ.400కు తగ్గకపోవడం రైతులకు ఊరట ఇచ్చే అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న ధర స్థానిక రైతులకు ఎలా ఇస్తారని కొనుగోలుదారులు చెబుతున్నా ఇప్పుడున్న డిమాండ్‌కు అనుగుణంగా కేజీ గింజలకు గాను కనీసం రూ.500 నుంచి రూ.550 ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

నోటిఫై చేయకపోవడం వల్లే

కోకో సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన శాఖ పలు రాయితీలు ఇస్తోంది. ఏరియా ఎక్స్‌పెన్షన్‌, ఎరువులు అందజేయడం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో గింజలు ఎండబెట్టేందుకు, నాణ్యమైన గింజల ఉత్పత్తికి డ్రెయిర్ల ఏర్పాటు కూడా చేసేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే ఈ పంటను ఉద్యాన పంటగా నోటిఫై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోంది. గత కొన్నేళ్లుగా రైతులు కోరుతున్నా ఫలితం లేకుండా ఉంది. దీనిని ఉద్యాన పంటగా నోటిఫై చేయకపోవడం వల్ల రైతులు పలు విధాలుగా నష్టపోతున్నారు.

ప్రైవేట్‌ కంపెనీ గుత్తాధిపత్యం

ఉద్యాన పంటగా నోటిఫై చేసి కేంద్రానికి సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం పలు రకాల పంటలకు ఇస్తున్నట్టుగానే కోకో గింజలకు సైతం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటిస్తుంది. ఏటా ఉత్పత్తి వ్యయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఉద్యాన పంటలైన కొబ్బరి, ఆయిల్‌పామ్‌కు ఎంఎస్‌పీ ఉంది. కనీస మద్దతు ధర లేనందున ప్రైవేట్‌ కంపెనీలు కోకో గింజల ధరలు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయి. గోదావరి జిల్లాలో గింజలను కేవలం ఒక ప్రైవేట్‌ కంపెనీ మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో ధరల విషయంలో వారిది గుత్తాధిపత్యంగా మారింది.

వర్తించని బీమా

కోకో పంటకు బీమా వర్తించడం లేదు. కొబ్బరి, ఆయిల్‌ పామ్‌, అరటి, ఇతర ఉద్యాన పంటలకు బీమా ఉంది. కాని కోకోకు బీమా వర్తించడం లేదు. ఈ పంట ఎక్కువగా కోస్తా తీరంలోనే ఉంది. తుపాన్లు, లంక గ్రామాల్లో గోదావరి వరదల వల్ల పంట నష్టపోతే రైతులకు బీమా పరిహారం అందే అవకాశం లేదు. దీనివల్ల రైతులకు సాగు భరోసా లేకుండా పోతోంది. బీమా సౌకర్యం కల్పించాలంటే తప్పనిసరిగా ఈ పంటను ఉద్యాన పంటగా నోటిఫై చేయాల్సిందే.

పెట్టుబడి రాయితీ లేదు

పంట నష్టపోయిన సమయంలో రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి రాయితీ (ఇన్‌ఫుట్‌ సబ్సిడీ) రావడం లేదు. మిగిలిన పంటలకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఉన్న విషయం తెలిసిందే. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు వరి, వరదల వల్ల అరటి, కొబ్బరి, కంద, కూరగాయ పంటలు, పవ్వులు, పండ్ల తోటలకు వస్తున్నట్టు కోకో పంటకు పెట్టుబడి రాయితీ రావడం లేదు. ఉద్యాన పంటగా నోటిఫై చేయకుండా కోకో సాగు విస్తీర్ణం కోసం అరకొర రాయితీలు ఇస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్నారు. రైతులకు పలు రకాల ప్రయోజనాలు అందే ఈ పంట సాగు విస్తీర్ణం గోదావరి జిల్లాలో పెద్దగా పెరగడం లేదు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. మరో 20 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ జరుగుతోంది. సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేందుకు అవకాశమున్నా కనీసం పది వేల ఎకరాల్లో కూడా సాగు జరగకపోవడానికి దీనిని నోటిఫై చేయకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు.

అప్పుడే మరిన్ని ప్రయోజనాలు

కోకో పంటను ఉద్యాన పంటగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి. అప్పుడు రైతులకు పూర్తిస్థాయిలో రాయితీలు అందుతాయి. కనీస మద్దతు ధరకు, పంటల బీమాకు ఒక భరోసా దక్కుతుంది. ఈ పంట మరింత లాభసాటిగా మారితే రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

– ముత్యాల జమ్మి, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌

ఆఫ్‌ ప్లాంట్‌ ఎల్త్‌ మెనేజ్‌మెంట్‌

(ఎన్‌ఐపీహెచ్‌ఎం) సభ్యుడు, అంబాజీపేట

కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటల్లో అంతర పంటగా ‘కోకో‘కు అదనపు ఆదాయం

ఉభయ గోదావరి జిల్లాల్లో

సుమారు 15 వేల ఎకరాల్లో సాగు

ఒక కంపెనీ కొనుగోలు వల్ల

రైతులకు దక్కని గిట్టుబాటు ధర

ఉద్యాన పంటగా నోటిఫై

చెయ్యని రాష్ట్ర ప్రభుత్వం

పంట నష్టపోతే రైతుకు దక్కని బీమా.. నష్ట పరిహారం

కనీస మద్దతు ధర ప్రకటించలేని పరిస్థితి

నోటిఫై చేస్తేనే లాభసాటి1
1/2

నోటిఫై చేస్తేనే లాభసాటి

నోటిఫై చేస్తేనే లాభసాటి2
2/2

నోటిఫై చేస్తేనే లాభసాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement