ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడికి ఖండన | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడికి ఖండన

Aug 8 2025 8:52 AM | Updated on Aug 8 2025 8:52 AM

ఎమ్మె

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడికి ఖండన

సఖినేటిపల్లి: పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ నెడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ పాటి శివకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సఖినేటిపల్లిలో ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి, తీవ్రంగా గాయపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బలహీనవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిపై దాడిగా పేర్కొంటూ, యావత్‌ బీసీ కులాలపై జరిగిన దాడిలా భావిస్తున్నట్టు వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

అన్న ప్రసాద భవనానికి రూ.1.5 లక్షల విరాళం

కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా కాకినాడకు చెందిన వేల్పూరు మురళీసురేష్‌ – భువనేశ్వరి దంపతులు, వారి కుటుంబ సభ్యులు గురువారం స్వామివారిని దర్శించుకుని, వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.1,50,116 అందజేశారు. రావులపాలేనికి చెందిన మల్లిడి నాగవెంకటఫణికుమార్‌రెడ్డి – శ్రీలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.27,000 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్తానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు.

నదీపాయలో పడి

మత్స్యకారుడి మృతి

అల్లవరం: మండలంలోని ఎన్‌.రామేశ్వరంలో నదీ పాయలో చేపల వేట సాగిస్తూ కొప్పాడి మహేష్‌ (36) ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అల్లవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన మహేష్‌ తన భార్య పుట్టింట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం భార్యతో చెప్పి చేపల వేటకు వెళ్లాడు. ఎన్‌.రామేశ్వరం బ్రిడ్జికి సమీపంలో నది పాయలో చేపల వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంపత్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని నదీపాయలో ఉన్న మహేష్‌ మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చి పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంగ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్‌ గురువారం తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సాంకేతికతతో గిరిజన

సంస్కృతి పరిరక్షణ

రాజానగరం: మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతీ సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్‌, కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యాన ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ, ‘స్థానిక ప్రజల కృత్రిమ మేధస్సు – హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తును రూపొందించడం’అనే థీమ్‌తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని అన్నారు. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో తన 35 ఏళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలపై అవగాహన కలిగి ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజనులు వాడుక భాషలో సాహిత్య సేద్యం చేస్తున్నారన్నారు. రాయిలో కూడా దేవుడిని చూడగలిగే నిర్మలమైన మనస్సున్న వారు గిరిపుత్రులని ప్రసన్నశ్రీ అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి, సదస్సు కన్వీనర్‌ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై  దాడికి ఖండన 1
1/2

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడికి ఖండన

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై  దాడికి ఖండన 2
2/2

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడికి ఖండన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement