
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి అమానుషం
● బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి
● ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు,
ఇజ్రాయిల్ డిమాండ్
● అమలాపురంలో జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
అమలాపురం టౌన్: బడుగు, బలహీన వర్గాల నేతలపై కూటమి ప్రభుత్వం ఓ పథకం ప్రకారం దాడులు చేయిస్తూ రాష్ట్రంలో ఆ సామాజిక వర్గీయులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. కడప జిల్లా పులివెందుల రూరల్ మండలంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి గాయపరిచిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో అమలాపురం మున్సిపల్ పిల్లల పార్కు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని పార్టీ జిల్లా బీసీ నేతలు తీవ్రంగా ఖండించారు. రమేష్ యాదవ్‌తోపాటు ఇటీవల ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ కార్యక్రమాలకు హాజరవుతున్న పార్టీకి చెందిన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ హారిక, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావులపై కూటమి ప్రభుత్వ నాయకులు దాడులు చేయడం దారుణమని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారును ధ్వంసం చేయడమే కాకుండా ఆయనపై హత్యాయత్నం చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ ధోరణి అవగతమవుతోందన్నారు. ఈ ముగ్గురి నేతలపై దాడులకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల నేతలపై కూటమి ప్రభుత్వం అనేక అరాచకాలకు పాల్పడుతూ విధ్వంసాలు సృష్టించడం చూస్తుంటే ఈ దాడులు ఆయా సామాజిక వర్గాలపై ప్రభుత్వం కక్ష కట్టి చేస్తున్నట్టు ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరజాకుమారి, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు దొమ్మేటి సత్య మోహన్, పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, కట్టోజు సన్నయ్యదాసు, పార్టీ నాయకులు కుడుపూడి భరత్ భూషణ్, భరణికాన బాబు, కుడుపూడి త్రినాథ్, విత్తనాల మూర్తి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ పిల్లల పార్కు వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, హైకోర్టు మాజీ న్యాయమూర్తి బీఏ స్వామి విగ్రహాలకు ఎమ్మెల్సీలు పూల మాలలు వేసి నివాళులర్పించారు.