
మార్కెట్‌కు వరలక్ష్మీ కళ
● బంగారు రూపుల కొనుగోలు
చేసిన మహిళలు
● పూలు, పండ్ల దుకాణాల వద్ద రద్దీ
అమలాపురం టౌన్: జిల్లాలో వరలక్ష్మీ వ్రతాలను శుక్రవారం ఇంటింటా నిర్వహించేందుకు గృహిణులు గురువారం సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వ్రతాలకు అవసరమైన పూజా సామగ్రిని సమకూర్చుకున్నారు. అమలాపురం, మండపేట, రామచంద్రపురం పట్టణాలతోపాటు ముమ్మిడివరం నగర పంచాయతీ, 22 మండల కేంద్రాల్లో మార్కెట్లు గురువారం లక్ష్మీ కళతో, వినియోగదారుల రద్దీతో కనిపించాయి. మహిళల సౌభ్యాగానికి వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో బంగారు దుకాణాలు మహిళా వినియోగదారులతో కిటకిటలాడాయి. మార్కెట్లు వరలక్ష్మీ వ్రత సామగ్రి దుకాణాలతో హడావుడిగా కనిపించాయి. బంగారు రూపు పెట్టుకుని మహిళలు వరలక్ష్మీ వ్రతమాచరిండచం సంప్రదాయం. బంగారు రూపుల కొనుగోలుకు మహిళలు గోల్డ్ మార్కెట్ల బాట పట్టారు. దీంతో బంగారు దుకాణాల్లో గురువారం మహిళా వినియోగదారులే అధికంగా కనిపించారు.
పెరిగిన బంగారం ధరలు
గత ఏడాదితో పోల్చితే బంగారం ధరలు ఈ ఏడాది మరింతగా పెరిగిన ప్రభావం జిల్లాలోని గోల్డ్ మార్కెట్‌లపై పడింది. గత ఏడాది ఒక గ్రాము బంగారు రూపు రూ.7 వేలు ఉంటే ఈ ఏడాది అదే గ్రాము రూపు రూ.10 వేలు వరకూ ధర పలికింది. తులం బంగారం రూ.లక్షకు పైగా ధర చేరడంతో గత ఏడాదితో పోల్చుకుంటే బంగారు రూపుల వ్యాపారం అంతంత మాత్రంగానే జరిగిందని అమలాపురం బులియన్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. అమలాపురం గోల్డ్ మార్కెట్‌లో ఉన్న దాదాపు 300 బంగారం దుకాణాల్లో బంగారు రూపుల అమ్మకాలు సాగాయి.
పూలు, పండ్లు దుకాణాల్లో అమ్మకాల జోరు
వరలక్ష్మీ వ్రతాల కోసం మహిళలు పలు రకాల పూలు, పండ్లు కొనుగోలు చేశారు. బత్తాయి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష పండ్లను కొనుగోలు చేశారు. అమలాపురం మార్కెట్లో అయితే రెగ్యులర్ పండ్ల దుకాణాలతో పాటు శ్రావణ శుక్రవారం కోసం రోడ్ల చెంత అనేక తాత్కాలిక దుకాణాలు వెలిశాయి. పండ్ల కొనుగోలుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ వెచ్చించారు. పూల కోసమైతే రూ.200 నుంచి రూ.500 వరకూ కేటాయించారు. స్వీటు దుకాణాల్లోనూ రద్దీ కనిపించింది.