
విద్యార్థి సంఘాల అణచివేతకే ఆ జీవో
అమలాపురం టౌన్: పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకల పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశించకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆ సంఘాల అణిచివేతకు చేసిన కుట్రని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఽశాఖ అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి అన్నారు. అమలాపురంలోని పార్టీ జిల్లా శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాలయాల్లోకి విద్యార్థి సంఘాల ప్రతినిధులు వెళ్లేది రాజకీయాలకు కాదని, అక్కడి సమస్యల పరిష్కారానికేనని ఆయన గుర్తు చేశారు. విద్యా రంగంలో సమస్యలపై పోరాటాలు చేసే విద్యార్థి సంఘాలపై ఈ నిషేధం పెట్టడం దారుణమన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణేనని పేర్కొన్నారు. ఈ జీవో విద్యాభివృద్ధికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూర్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు పితాని బేబీరావు, కొనుకు వెంకటేశ్వరరావు, సాధనాల రామకృష్ణ, యండమూరి శ్రీనివాస్, గానుగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
నాటు, లైసెన్సు లేని
తుపాకులు ఉంటే నేరం
రాజమహేంద్రవరం రూరల్: నాటు, లైసెన్స్ లేని తుపాకులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎవరి వద్దనైనా నాటు, లైసెన్సు లేని తుపాకులు, ఇతర మారణాయుధాలు ఉన్నట్టు గుర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఎవరి వద్దనైనా ఆయుధాలుంటే వెంటనే వాటిని దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో అందజేయాలని అన్నారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని, అక్రమ మారణాయుధాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.