
మట్టి, చెట్లు మాయం
గోపాలపురం: గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొల్లేరు చెరువులో ఉన్న మట్టిని టీడీపీ నాయకులు తరలించడంతో పాటు గట్టుపై ఉన్న అత్యంత విలువైన చెట్లను నరికివేశారు. నీటి సంఘం ముసుగులో తాత్కాలిక తీర్మానం చేసి ఇరిగేషన్ అధికారులకు కనీసం సమాచారం లేకుండా రూ.లక్షా 50వేలకు అమ్ముకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో చెరువులో ఉన్న లక్షలాది రూపాయల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇదంతా టీడీపీ నాయకులు కనుసన్నలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గోపాలపురం మండలంలోని గంగోలు, భీమోలు, నందిగూడెం, జగన్నాథపురం, కరిచర్లగూడెం గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని ఆయా గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గ ముఖ్యనాయకుడికి 70 శాతం వాటాగానూ, మిగిలిన 30శాతం వాటా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు పంచుకొనే విదంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చెరువు మట్టిని తరలించి అమ్ముకున్న సొమ్ము మొత్తం 100 శాతం నియోజకవర్గ ముఖ్య నాయకుడికి అందజేయాలని ఆ తర్వాత మాత్రమే నాయకులకు 30శాతం అందజేస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే మొత్తం 100శాతం అప్పగించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సుముఖంగా లేకపోవడంతో ఇప్పటికే 30 శాతం వాటా సొమ్మును ఆయా గ్రామాల నాయకులు వాడుకున్నారు. ఎన్నికల సమయంలో మా గ్రామంలో ప్రతి కార్యక్రమానికి తమ సొంత సొమ్ము ఖర్చు చేశామని, కనీసం 30శాతం వాటా కూడా ఇవ్వకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మా భాగస్వామ్యం ఉన్నా కనీసం చెరువు అక్రమ మట్టి తవ్వకాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ తెలియజేయడం లేదని ఒక పక్క జనసేన, బీజేపీ నాయకులు మధన పడుతున్నారు.
దీనిపై ఇరిగేషన్ ఏఈ, డీఈ కె.రవీంద్ర, రాహుల్ భాస్కర్‌లను వివరణ కోరగా చెరువుల్లోని మట్టిని రైతులు తమ పంట పొలాలకు తీసుకెళ్లడానికి అనుమతులు ఇచ్చామని కానీ ఆ మట్టిని ఇటుక బట్టీలకు తరలించినట్లు మాకు సమాచారం రావడంతో నిలుపుదల చేశామన్నారు. బొల్లేరు చెరువు గట్టుపై విలువైన వేప, ఇతర జాతుల చెట్లు నకరడం మా దృష్టికి వచ్చిందని దానిపై జిల్లా ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
గోపాలపురం బొల్లేరు చెరువులో
నీటి సంఘం నిర్వాకం
అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే..
పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్న
అధికారులు

మట్టి, చెట్లు మాయం

మట్టి, చెట్లు మాయం