
షాపులపైకి దూసుకు వెళ్లిన లారీ
పి.గన్నవరం: ఆర్‌పీ రోడ్డులో గురువారం తెల్లవారు జామున కోళ్ల లోడుతో వేగంగా వస్తున్న లారీ స్థానిక మూడు రోడ్ల సెంటర్లో షాపులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో టీ స్టాల్ నిర్వాహకుడు మృతి చెందగా, నాలుగు షాపులు ధ్వంసమయ్యాయి. లారీ డ్రైవర్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అక్కడ టీ అమ్మకాలు ప్రారంభమైతే ప్రాణ నష్టం ఎక్కువ ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
గ్రామానికి చెందిన వాసంశెట్టి త్రిమూర్తులు (57) కొన్నేళ్లుగా స్థానిక సెంటర్లో వంతెన కింద టీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆక్రమణలు తొలగింపులో భాగంగా అతని టీ స్టాల్‌ను తొలగించారు. పది రోజుల క్రితం వంతెనకు ఎదురుగా ఉన్న షాపులో టీ స్టాల్‌ను మళ్లీ ప్రారంభించాడు. గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో టీ స్టాల్‌ను తెరచేందుకు బరకాలు తొలగిస్తుండగా ఏలూరు నుంచి రాజోలుకు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి షాపులపైకి దూసుకు వచ్చింది. అక్కడే ఉన్న త్రిమూర్తులును లారీ వేగంగా ఢీకొట్టడంతో 20 మీటర్ల దూరంలో రోడ్డుపై ఎగిరిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానిక సీహెచ్‌కీ తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడిని 108 అంబులెన్స్‌లో అమలాపురంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా దారిలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహానికి అమలాపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. త్రిమూర్తులు మృతితో భార్య, కుమారులు, బంధువులు భోరున విలపించారు. అతడి మృతికి సంతాపంగా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉదయం పి.గన్నవరంలో షాపులు మూసివేసి బంద్ పాటించారు. త్రిమూర్తులు మృతదేహానికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
టీ స్టాల్ నిర్వాహకుడి మృతి
నాలుగు షాపులు ధ్వంసం
టీ స్టాల్ ప్రారంభమైతే పెద్ద ప్రమాదం జరిగేది
స్థానిక మూడు రోడ్ల సెంటర్లో త్రిమూర్తులు టీ స్టాల్‌ను తెల్లవారు జామున తీస్తారు. ఉదయం వరకూ టీస్టాల్ వద్ద ఎక్కువ మంది నిల్చోని ఉంటారు. షాపు ప్రారంభించిన తర్వాత ఈ లారీ దూసుకు వచ్చుంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. లారీ దూసుకు రావడంతో ఒక కూల్ డ్రింక్ షాపు, టీస్టాల్, వస్త్ర దుకాణం, కాఫీ హొటల్ ధ్వంసం అయ్యాయి.

షాపులపైకి దూసుకు వెళ్లిన లారీ