
మర్యాదలకు మారుపేరు కోనసీమ
కొత్తపేట: అతిథి మర్యాదలకు మారుపేరు కోనసీమ ప్రాంతమని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు నాగూర్‌బాబు (మనో) అన్నారు. మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని సోమవారం ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా మందపల్లి క్షేత్రాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, తైలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన హరహర మహాదేవా శంభో.. కై లాసవాసా.. మందపల్లి మందేశ్వరా.. శనేశ్వరా.. అంటూ గానం ఆలపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు కురిసి చాలా రోజులైందని అంటుండగా, సరిగ్గా పూజలు జరుగుతున్నప్పుడు వరుణుడి ఆశీర్వాదంతో వర్షం కురవడం, శనైశ్చరుని మహిమ అని, తన జీవితంలో అద్భుత సంఘటన అన్నారు. శనిదోషం ఉన్నవారు మాత్రమే శనైశ్చరుని దర్శించుకోవాలనేది వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమా సెన్సార్‌కు వెళుతుందని, రాత్రి డబ్బింగ్ చెప్పి ఫ్లైట్‌లో వచ్చానన్నారు. ఇక్కడి నుంచే డైలాగ్ చెప్పి వాట్సాప్‌లో పంపించానని తెలిపారు. ఈ కోనసీమ ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరన్నారు. తొలుత మనో, వారి కుటుంబ సభ్యులకు ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు, మాజీ చైర్మన్ చింతం విజయకృష్ణమోహన్ స్వాగత మర్యాదలు చేశారు.
● ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో
● మందపల్లి శనైశ్చరాలయంలో
ప్రత్యేక పూజలు