వద్దురొయ్య అంటే..! | - | Sakshi
Sakshi News home page

వద్దురొయ్య అంటే..!

Aug 5 2025 7:16 AM | Updated on Aug 5 2025 7:16 AM

వద్దు

వద్దురొయ్య అంటే..!

నిలకడ లేని ధరతో ప్రతికూల ప్రభావం

అమెరికా టారిఫ్‌తో

మరో రూ.30 పడిపోయిన వైనం

అయినా.. సీడ్‌ వేసేందుకు

చెరువులను సిద్ధం చేస్తున్న రైతులు

మలికిపురం: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది ఆక్వా రైతు పరిస్థితి. నిలకడ లేని ధర, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు ఆక్వా రైతులను కుదుటపడనీయడం లేదు. ప్రధానంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలను సాగు చేసే రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం రొయ్య ధర కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ రైతుల వద్ద సరకు లేదు. గత నెలలో కురిసిన వర్షాలకు వాతావరణ సమతుల్యత లోపించడంతో, తెగుళ్ల సమస్యతో రొయ్యలను ఇష్టానుసారం అమ్మేశారు. ఆగస్టు వరకూ వంద కౌంట్‌ రొయ్యలు తీసిన రైతు లేడు. వర్షాలు, ఎండల వల్ల సమతుల్యత దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అధిక కూలింగ్‌ లేకుంటే, అధిక వేడి ఏర్పడింది. వేడిని తట్టుకునేలా రొయ్యలకు వాడేందుకు ప్రొ బయోటిక్స్‌ ఉన్నాయి కానీ, అధిక చల్లదనాన్ని నివారించేందుకు ప్రొ బయోటిక్స్‌ లేవని రైతులు అంటున్నారు. మారిన వాతావరణంతో రొయ్యల చెరువులు విబ్రియో వంటి వైరస్‌ బారిన పడ్డాయి. జిల్లాలో పది రోజులుగా పిల్ల వేసిన 20 రోజులకే చెరువులు వైరస్‌ బారిన పడుతున్నాయి. పూర్తి స్థాయి కౌంట్‌కు రాకుండా కూడా రొయ్య వైరస్‌ బారిన పడుతోంది. దీంతో కొన్నిచోట్ల చెరువులను ముందుగానే పట్టి రైతులు అయిన కాడికి అమ్ముకుంటున్నారు. లేదంటే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని భీతిల్లుతున్నారు. పట్టుబడి పడుతున్న చెరువుల్లో 100 నుంచి 150 కౌంట్‌ కూడా ఉండడం గమనార్హం.

వేలాది ఎకరాల్లో నష్టం

ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టపోయిన రైతులు ఉన్నారు. రైతులు అందించిన వివరాల ప్రకారం, ఉమ్మడి జిల్లాలో గడచిన పది రోజుల్లో రొయ్య సీడ్‌ వేసిన నెల రోజులకే చెరువులను ఖాళీ చేశారు. మరలా సీడ్‌ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గత జూలై నెలలో 100 కౌంట్‌ రొయ్య ధర రూ.270 ఉంది. రెండు రోజుల క్రితం అమెరికా విధించిన సుంకంతో అది రూ.30 తగ్గి రూ.240కి పడిపోయింది. ఆశ చావని ఆక్వా రైతులు మరలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

40 వేల ఎకరాల్లో సాగు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 72 వేల ఎకరాల్లో చెరువులు ఉండగా, సుమారు 40 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సీడ్‌ వేసిన అనంతరం రెండు నెలలు అన్నీ అనుకూలిస్తే 100 కౌంట్‌కు వస్తుంది. అలా జరిగి, రూ.240 ధర నిలకడగా ఉంటే రైతుకు పెట్టుబడి వస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో 40 కౌంట్‌ కూడా తీసే రైతులు లేరు. అప్పటి దాకా ఉండాలన్నా, ధర ఎలా ఉంటుందో తెలియదు. పెట్టుబడి మాత్రం పెరుగుతుంది. ఓవైపు లీజులు మాత్రం చెల్లించాలి. పెద్ద రైతులకు కరెంట్‌ ఖర్చు తప్పదు. కూలి ఖర్చుల భారం పెరుగుతుంది.

నిలకడ లేని ధరతో ఇబ్బందులు

తెగుళ్లు, నిలకడ లేని ధరతో ఇబ్బందులు పడుతున్నాం. గత నెల కౌంట్‌కు రాక రొయ్యను అర్ధంతరంగా పట్టేయాల్సి వచ్చింది. నష్టాలు అధికంగా చవిచూశాం. ప్రస్తుత వర్షాకాలం కూడా వాతావరణ సమతుల్యత ఏర్పడి, చెరువులు కౌంట్‌కు వచ్చే దాకా నమ్మకం ఉండదు.

– రుద్రరాజు చిన్నరాజా, ఆక్వా రైతు, గుడిమూల

సమతుల్యత

లోపంతోనే ఇబ్బంది

వాతావరణ సమతుల్యతతో రొయ్యలకు ఇబ్బందులు వస్తాయి. వర్షాలు, ముసురు, ఎండలు ఒకేసారి రావడం వల్ల రొయ్య ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చెరువుల్లో ఆక్సిజన్‌ తగ్గి, రొయ్యలకు తెగుళ్లు సోకుతాయి. ఎండలను తట్టుకునేందుకు ప్రొ బయోటిక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అధిక శీతలానికి మందులు లేవు.

– సిద్ధార్థ వర్ధన్‌,

మత్స్య శాఖ అభివృద్ధి అధికారి,

రాజోలు

వద్దురొయ్య అంటే..!1
1/3

వద్దురొయ్య అంటే..!

వద్దురొయ్య అంటే..!2
2/3

వద్దురొయ్య అంటే..!

వద్దురొయ్య అంటే..!3
3/3

వద్దురొయ్య అంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement