
అన్నదాత సుఖీభవలో రైతులకు మోసం
● రూ.40 వేల స్థానే రూ.5 వేలతో
సరిపుచ్చిన కూటమి ప్రభుత్వం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
చిర్ల జగ్గిరెడ్డి ధ్వజం
● కలెక్టరేట్ వద్ద పార్టీ శ్రేణుల నిరసన
అమలాపురం రూరల్: రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని 2024 జూన్ నుంచి అమలు చేసి రూ.20 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రెండేళ్లకు ప్రతి రైతుకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. పార్టీ రైతు నాయకులతో కలిసి కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి ఈ పథకాన్ని కోత పెట్టారని, పీఎం కిసాన్ యోజనతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇవ్వాలని కోరారు. బఫర్ స్టాక్ నిర్వహణ లోపం కారణంగా యూరియా ధరను వ్యాపారులు పెంచేస్తున్నారని, యూరియా బస్తాకు బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 అదనంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, గతేడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు బీమా సొమ్ము అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా తొలగించారని, గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు తమ పంటను రోడ్డుపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి అమలు చేస్తే, ఆ పథకాన్నీ ఎత్తివేసి రైతులను కష్టాలపాలు చేశారన్నారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది అన్నదాత సుఖీభవ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, అమలాపురం, రామచంద్రపురం నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాశ్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నూరి రామారావు(బాబి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, ఐటీ విభాగం అధ్యక్షుడు తొరం గౌతం, నాతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాత సుఖీభవలో రైతులకు మోసం