
అగ్గి... సర్వం బుగ్గి
ఫ చినశంకర్లపూడిలో అగ్ని ప్రమాదం
ఫ ఆరు తాటాకిళ్లు భష్మీపటలం
ప్రత్తిపాడు: ఊరంతా నిశ్శబ్దం.. అందరూ నిద్రలోకి జారుకున్నారు.. ఇంతలో ఒళ్లంతా వేడి సెగలు.. తుల్లిపడిన ఆ కుటుంబాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాయి.. తేరుకునేలోపే ఆరు తాటాకిళ్లు కాలిపోయాయి. సర్వం బుగ్లి అయ్యింది. ఆ పేద కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఆరు కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. విద్యుత్ షార్ట్‌షర్క్యూట్ కారణంగా ముంచుకొచ్చిన ముప్పు ఇళ్లను బూడిద చేసింది. చినశంకర్లపూడి హరిజన కాలనీలో బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ కుటుంబాలు తాటాకిళ్లలో జీవిస్తున్నారు. వీరంతా వ్యవసాయ కూలీలే.
ఒక్కసారిగా అగ్నికీలలు
ఊరంతా గాఢ నిద్రలో ఉండగా శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో బుర్రి మరిడమ్మ తాటాకింటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. తేరుకునే లోగా మంటలు ఒక్కొక్క ఇంటికి వ్యాపించాయి. ఇళ్లలోని వారంతా బయటకు పరుగులు తీశారు. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి చొప్పున మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ ఇళ్లకు మంటలు వ్యాపించాయి. బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, పిరాటి అచ్చారావు ఇళ్లలో వేడిమికి గ్యాస్ సిలెండర్లు పేలిపోవడంతో మంటలు క్షణాల్లోనే ఆరు తాటాకిళ్లను భష్మీపటలం చేశాయి. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ కె.రాముడు, లీడింగ్ ఫైర్‌మెన్ కేఎస్‌ఎన్ మూర్తి తమ సిబ్బందితో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ రాముడు తెలిపారు.
బాధితులంతా నిరుపేదలే..
ఒంటరి మహిళ బుర్రి మరిడమ్మ ఒక ఇంట్లో ఉంటుండగా, చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు, భార్యతో కలసి మానూరి రాజబాబు ఒక ఇంట్లో, భార్య నాగమణితో కలసి ముతకల నాగేశ్వరరావు, భార్యతో కలసి పిరాటి అచ్చారావు, భార్య కుమారుడితో కలసి పిరాటి అప్పారావు, ఒంటరిగా పులగపూరి సత్యనారాయణలు మరో ఇంట్లో జీవిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో సమస్తం కాలి బూడిద కావడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సందర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, వంట సామగ్రి పంపిణీ చేశారు.

అగ్గి... సర్వం బుగ్గి