
దళిత సర్పంచ్‌ను అవమానించారంటూ ఫిర్యాదు
అమలాపురం రూరల్: పేరూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆ గ్రామ సర్పంచ్ దాసరి అరుణాడేవిడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళా సర్పంచ్ కావడంతోనే స్థానిక నాయకులు తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్‌కు విరుద్ధంగా సర్పంచ్ లేకుండా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పింఛన్లు పంపిణీ చేయడం దారుణమని ఆమె శనివారం డీఎల్‌పీఓ బొజ్జిరాజుకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ కుడుపూడి సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి సుబ్బిరామ్, వాసంశెట్టి శ్రీనివాసరావు, దొంగ ఆంజనేయులు, వార్డు సభ్యుడు అప్పారి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దాసరి నాగేశ్వరరావు తదితరులు డీఎల్‌పీఓకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ కార్యక్రమంలో సర్పంచ్ లేకుండా ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేయడం సరికాదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
జగ్గంపేట: కాట్రావులపల్లిలో పోలీసుల తనిఖీల్లో గంజాయితో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో శనివారం కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాట్రావులపల్లికి చెందిన కె.లోవరాజు అనే రాజేష్ ఎలియాస్ పటేల్ (37)ను అనుమానంతో అరెస్టు చేశారు. అతని వద్ద 4.38 కిలోల గంజాయి లభ్యమైంది. లోవరాజును పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు.

దళిత సర్పంచ్‌ను అవమానించారంటూ ఫిర్యాదు