
పశుదాన యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు
● కలెక్టర్ మహేష్ కుమార్
● అధికారులతో సమావేశం
అమలాపురం రూరల్: జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుదాన యూనిట్లు నెలకొల్పేందుకు మండలాల వారీగా సంఘాలను ఏర్పాటు చేసి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఆయన గురువారం పశుసంవర్ధక శాఖ, ఉద్యాన అధికారులుతో సమావేశం నిర్వహించారు. కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు, పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ప్రధాన మంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను రాయితీలతో ప్రోత్సహించాలన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమ స్థాపనకు జిల్లా పరిశ్రమల కేంద్రం లీడ్ బ్యాంకు అధికారులు రాయితీలలు ఇవ్వాలని ఆదేశించారు. స్థానికంగా కొబ్బరి ఆక్వా ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
● జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ, మామిడికుదురు మండలం పూర్వపు విద్యార్థులైన నవీన్, సూర్యప్రసాద్, రవీంద్రనాథ్, నిరంజన్.. కెరీర్ గైడెన్స్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్క్‌షాప్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి మేరకు ఏ రంగాలలో స్థిరపడాలనుకున్నారో, ఆ దిశగా అవగాహన కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ వారిని ఫలానా వృత్తి కోర్సులు తీసుకోవాలని బలవంతం చేయరాదన్నారు.
● అర్హులైన రైతులందరికీ శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు రూ.7 వేల జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు తీరుపై అధికారులతో మాట్లాడారు.
● పీ4 కార్యక్రమంలో గ్రామ సభలు, సర్వేల ద్వారా బంగారు కుటుంబాల అవసరాల గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 65 వేల బంగారు కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 27 వేల కుటుంబాలను దత్తత ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 19 మార్గదర్శులను గుర్తించినట్లు తెలిపారు.