
నెమ్మదిగా తగ్గుతున్న వరద
ఐ.పోలవరం: గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. వరద నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద జలాల రాక తగ్గుతోంది. దీనితో బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి దిగువునకు 5,86,477 క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం ఆరు గంటల సమయానికి 5,14,177 క్యూసెక్కులకు తగ్గింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతానికి 4,71,927 క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే బ్యారేజీ వద్ద ఉధృతి తగ్గినా దిగువున లంక గ్రామాలను వరద వీడలేదు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి, పి.గన్నవరం అక్విడెక్టులను తాకుతూ ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరికి జూలై నెలలో రెండవ సారి వచ్చిన వరద కూడా స్వల్పంగానే ప్రభావం చూపించడంతో లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
సగటున పది మిల్లీమీటర్ల వర్షం
జిల్లాలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 10 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యధికంగా పి.గన్నవరం మండలంలో 36.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మలికిపురం మండలంలో ఒక మిల్లీమీటర్ కురిసింది. అంబాజీపేటలో 30.8, అమలాపురంలో 25.2, ముమ్మిడివరంలో 20.4, ఐ.పోలవరంలో 16.4, మామిడికుదురులో 16.2, అల్లవరంలో 12.8, ఉప్పలగుప్తంలో 11.8, రాజోలులో 10, అయినవిల్లిలో 9.6, కాట్రేనికోనలో 9.2, మండపేటలో 6.2, కొత్తపేటలో 5, కె.గంగవరంలో 4.2, ఆత్రేయపురంలో 3.6 మిల్లీ మీటర్లు నమోదైంది.