
6 నుంచి దివ్యాంగ పిల్లలకు శిబిరాలు
రామచంద్రపురం రూరల్: జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి దివ్యాంగ బాలలకు ఉపకరణాలు అందించే లక్ష్యంతో వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఏడాది నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న బాలలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ ఆధార్ కార్డు, తల్లిదండ్రుల రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలు తీసుకురావాలన్నా రు. ఈనెల 6న రామచంద్రపురం ఎంఈవో కార్యాలయంలో జరిగే శిబిరానికి రామచంద్రపురం, కె.గంగవరం, రాయవరం మండలాలకు చెందిన వారు హాజరవ్వాలన్నారు. 7న ముమ్మిడివరం జెడ్పీ హైస్కూల్లో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల వారికి, 11న అమలాపురం జెడ్పీ హైస్కూల్లో అమలాపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలకు, 12న రాజోలు దొరగారితోటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల వారికి నిర్వహిస్తున్నామన్నారు. అలాగే 13న అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలకు, 14 రావులపాలెం జెడ్పీ హైస్కూల్లో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట మండలాలకు, 18న మండపేట ఉన్నత పాఠశాలలో ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం మండలాల వారికి శిబిరాలు జరుగుతాయన్నారు.
నిత్య కల్యాణాల
టిక్కెట్లు విడుదల
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో 2025 సెప్టెంబర్ నెలకు సంబంధించి నిత్య కల్యాణాల టిక్కెట్లను గురువారం విడుదల చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం కారణంగా ఆ రోజు కల్యాణాలు రద్దు చేశామన్నారు. మిగిలిన 29 రోజులకు సంబంధించి 3,364 కల్యాణాలకు ఆన్‌లైన్ 1,972, కార్యాలయంలో 1,392 అందుబాటులో ఉంటాయన్నారు. వీటి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో, నేరుగా గానీ పొందవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకూ మాస పూజలు రుద్ర హోమం, చండి హోమం, లక్ష పత్రి పూజ టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామన్నారు.
కడియం నర్సరీ అందాలు అద్భుతం
కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.