
ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
అమలాపురం టౌన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పాఠ్య పుస్తకాలు మారడం వల్ల కొత్త సిలబస్‌లో వచ్చిన మార్పులను గమనించి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని ఇంటర్మీడియట్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేసీ) ఎం.ఆదినారాయణ సూచించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం సిలబస్ కూడా మారుతుందని తెలిపారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డీఐఈవో వనుము సోమశేఖరావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆర్‌జేసీ ఆదినారాయణ మాట్లాడారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కష్టపడి విద్యార్థులను చదివించి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో ఆర్‌జేడీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి మారుతున్న సిలబస్‌ను వివరించారు. మారుతున్న సిలబస్‌కు అనుగుణంగా ఉండాల్సిన విద్యా బోధనపై చర్చించారు.