
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సఖినేటిపల్లి: అప్పనరామునిలంకలో శనివారం 40 మంది విద్యార్థులతో ప్రయాణిస్తున్న కాన్వెంట్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆనుకుని ఆగింది. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. దీంతో విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరమ్మతులు చేయకుండా రోడ్లపైకి వస్తున్న ఇలాంటి బస్సులపై రోడ్ ట్రాన్స్‌పోర్టు అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైవర్ల ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి తాడి సహదేవ్ విజ్ఞప్తి చేశారు.
తెగిపడిన విద్యుత్ తీగలు
రెండు తాడిపెద్దుల మృతి
తుని: స్థానిక మార్కెట్ యార్డులో విద్యుత్ తీగలు తెగిపడిన సంఘటనలో రెండు తాడి పెద్దులు మృతి చెందాయి. శనివారం ఉదయం పశువులు ఆ మార్కెట్‌లోని వ్యర్థాలను తింటుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు పడటంతో రెండు తాడిపెద్దులు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ శాఖ లైన్ల నిర్వహణ సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు.

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం