అభ్యసనం.. మరింత పటిష్టం
● 1, 2 తరగతుల్లో మెరుగైన
అభ్యసనానికి ఎఫ్‌ఎల్‌ఎన్
● ఓడలరేవు బీవీసీ కళాశాలలో
డీఆర్పీలకు శిక్షణ
రాయవరం: పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో మంచి బోధన జరిగినప్పుడే విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఇందులో భాగంగా 2023 నుంచి విద్యార్థి అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్)లో భాగంగా ఎన్జీవో సంస్థ ప్రథమ్ భాగస్వామ్యంతో ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలల్లో అమలుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నూతన విద్యా విధానం–2020లో భాగంగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. నిపుణ్ భారత్ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎర్లీ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)ను తీసుకొచ్చింది. ఇందులో ప్రీ ప్రైమరీ–1, 2ను అమలు చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ–1లో 3–4 ఏళ్ల చిన్నారులకు, ప్రీ ప్రైమరీ–2లో 4–5 ఏళ్ల చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తారు. ప్రీ ప్రైమరీలోనే పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాలను అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీలో 1, 2 తరగతులకు ఫౌండేషన్ లిటరసీ, న్యుమరసీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి రెండో తరగతి నుంచి మూడో తరగతికి వెళ్లే విద్యార్థులంతా ఆయా తరగతుల అభ్యసనా సామర్థ్యాలను కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తొలుత ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నారు. మండలానికి ముగ్గురు ఎస్జీటీలను డీఆర్పీలుగా ఎంపిక చేసి వారికి రెసిడెన్షియల్ మోడ్‌లో శిక్షణ అందిస్తున్నారు. దీనికి ప్రతి జిల్లాలో మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎఫ్‌ఎల్‌ఎన్ అమల్లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను జ్ఞాన జ్యోతిగా, ప్రాథమిక విద్యను జ్ఞాన ప్రకాష్‌గా పేర్కొన్నారు.
రేపటి నుంచి రెండో దశ శిక్షణ
ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో ఎంపికై న డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ (డీఆర్పీ)లకు మొదటి దశ శిక్షణ 2023 జూలైలో ఇచ్చారు. రెండో దశ అమల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 25 వరకు కేఆర్పీలకు విజయవాడలో శిక్షణిచ్చారు. ఈ నెల 27 నుంచి శిక్షణ పొందిన కేఆర్పీలు డీఆర్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు. అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి 60, ఏలూరు 88, తూర్పుగోదావరి 57, కాకినాడ 63, కోనసీమ జిల్లా నుంచి 66 మంది డీఆర్పీలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వచ్చే నెల 5 నుంచి ఆయా జిల్లాల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
కచ్చితంగా హాజరు కావాలి
పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో పునాది అభ్యసనం బలంగా ఉండాలనే ఉద్దేశంతో జ్ఞాన్ జ్యోతి, జ్ఞాన ప్రకాష్ ప్రోగ్రామ్స్‌ను గతేడాది జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేశాం. రెండో దశ అమల్లో భాగంగా తొలుత డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నాం. ప్రతి డీఆర్పీ శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా,
డీఈఓ, అమలాపురం
మంచి ఫలితాలు వస్తాయి
ఎఫ్‌ఎల్‌ఎన్‌ను సమర్ధవంతంగా అమలు చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. తెలుగు, గణితంలో ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థికి మంచి పునాది ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం సమర్ధవంతంగా అమలుకు ఆదేశాలు ఇచ్చాం.
– జి.నాగమణి, ఆర్జేడీ,
పాఠశాల విద్యాశాఖ, కాకినాడ
ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో భాగంగా యాక్టివిటీస్ ప్రదర్శిస్తున్న డీఆర్పీలు (ఫైల్)
అభ్యసనం.. మరింత పటిష్టం
అభ్యసనం.. మరింత పటిష్టం
అభ్యసనం.. మరింత పటిష్టం


