
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం మధ్యాహ్నం, రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, పరమేశ్వరుడు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరి వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.