గురువులకు పరీక్షే! | - | Sakshi
Sakshi News home page

గురువులకు పరీక్షే!

Apr 21 2025 12:08 AM | Updated on Apr 21 2025 12:08 AM

గురువులకు పరీక్షే!

గురువులకు పరీక్షే!

ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

తీవ్ర పోటీ తప్పదని నిపుణుల అంచనా

జిల్లాలో వివిధ విభాగాల్లో 1,241 పోస్టులు

రాయవరం: అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన డీఎస్సీ (డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ)–2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం పది నెలలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉపాధ్యాయ కొలువు సాధించాలని ఎన్నో కలలు కంటున్న అభ్యర్థులకు అదేమీ అంత ఆషామాషీ కాదంటున్నారు నిపుణులు. అందుకు కారణం ఊరించి ప్రకటించిన డీఎస్సీలో ముఖ్యంగా ఎస్‌జీటీ పోస్టులు తక్కువ కావడం.. వయో పరిమితి పెంచడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

అభ్యర్థుల్లో ఆందోళన

ఎట్టకేలకు శనివారం రాత్రి డీఎస్సీ నోటిపికేషన్‌ విడుదల చేశారు. సిలబస్‌పై కూడా స్పష్టత రావడంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఒక వైపు ఆనందం, మరోవైపు ఆందోళన కనిపిస్తున్నాయి. డీఎస్సీకి వయోపరిమితిని గరిష్ఠంగా 44 ఏళ్లకు పెంచారు. డీఎస్సీ ప్రకటనకు రెండు రోజుల ముందు ఈ పెంపు జరిగింది. గత డీఎస్సీలో తృటిలో ఉద్యోగావకాశం కోల్పోయిన వారికి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అయితే 2018 డీఎస్సీ అనంతరం ఆరేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ విడుదల కావడంతో కొందరికి అర్హత వయస్సు దాటిపోయే అవకాశముంది. అందువల్ల ఆరేళ్ల వయో పరిమితి (46 సంవత్సరాలకు) పెంచాలనే డిమాండ్‌ అటు ఉద్యోగార్థుల నుంచి, ఇటు ఉపాధ్యాయ సంఘాల నుంచి వినిపిస్తోంది. వయో పరిమితి పెంపుతో ఈసారి గట్టి పోటీ తప్పదు. దీనికి తోడు జిల్లాలో ఈ సారి భర్తీ చేసే ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య కేవలం 423 ఉండడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

1,241 పోస్టుల భర్తీకి చర్యలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ/ఎంపీపీ, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్ల పరిధిలో 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్‌జీటీ పోస్టులు 423 కాగా, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో అధికంగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఆ తర్వాత సోషల్‌, బయాలజీ పోస్టులు ఖాళీలు అధికంగా ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులు కేవలం రెండంకెల్లో ఖాళీలున్నాయి. ట్రైబల్‌ వెల్ఫేర్‌ విభాగంలో ఎస్‌ఏ (పీఎస్‌)–03, ఎస్‌ఏ (బీఎస్‌)–04, ఎస్‌ఏ(పీఈ)–01, ఎస్‌జీటీ పోస్టులు 104 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా జోన్‌–2 పరిధిలో ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీ మోడల్‌ స్కూల్స్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌/ట్రైబల్‌ (గురుకులం) యాజమాన్య పాఠశాలల్లో 348 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో పీజీటీ–49, టీజీటీ–272, పీడీ–03, పీఈటీ–24 పోస్టులు భర్తీ చేయనున్నారు.

పోటీ అధికమే

డీఎస్సీకి పోటీ అధికంగా ఉండే అవకాశముంది. ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్‌ శిక్షణ పొందిన వారు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎడ్‌ శిక్షణ పొందిన వారు అర్హులు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కూడా పోటీ అధికంగానే ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 35 నుంచి 40 వేల మంది పోటీ పడే అవకాశముందని భావిస్తున్నారు. 2018 డీఎస్సీలో ఒక పోస్టుకు 101 మంది పోటీ పడ్డారు. ఎస్‌జీటీ విభాగంలో ఒక్కో ఖాళీకి 101 మంది పోటీ పడగా, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఒక్కో పోస్టుకు 124 మంది పోటీ పడ్డారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజెస్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 94 మంది పోటీ పడ్డారు. ఆ లెక్కన చూస్తే ప్రస్తుత డీఎస్సీలో కూడా పోటీ అధికంగానే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

షెడ్యూల్‌ ఇదీ..

ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లింపు/అప్లికేషన్‌ గడువు : ఈ నెల 20 నుంచి మే 15 వరకు

మాక్‌ టెస్ట్‌ (నమూనా పరీక్ష): మే 20

హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌: మే 30 నుంచి

పరీక్ష తేదీలు: జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు

ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన

రెండో రోజు

అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదల అనంతరం వారం రోజులకు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఖాళీల వివరాలు ఇలా..

కేటగిరి ప్రభుత్వ/జెడ్పీ/

మున్సిపల్‌

స్కూల్స్‌

ఎస్‌జీటీ 423

ఎస్‌ఏ తెలుగు 65

ఎస్‌ఏ హిందీ 78

ఎస్‌ఏ ఇంగ్లీష్‌ 95

ఎస్‌ఏ గణితం 64

ఎస్‌ఏ పీఎస్‌ 71

ఎస్‌ఏ బయాలజీ 103

ఎస్‌ఏ సోషల్‌ 132

ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 210

మొత్తం 1,241

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement