జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా వాసులు, అధికారులకు 2026 నూతన సంవత్సర సందర్భంగా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో మనందరికీ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమం, సమగ్ర ప్రగతిలో ముఖ్య మైలురాయిగా నిలిచాయన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి, ప్రగతి పథంలో ముందుకు సాగాలని ప్రతి పౌరుడు సుఖశాంతులతో, ఆరోగ్యంతో, సమృద్ధితో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజల సేవలో అంకితభావంతో, సమన్వయంతో, పారదర్శకతతో నిండిన పరిపాలనను కొనసాగిద్దామని అధికారులను కోరారు.
రూ.3.97 కోట్ల
మార్కెట్ సెస్ వసూళ్లు
అంబాజీపేట: మూడు నెలల సమయం ఉండగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3 కోట్ల 97 లక్షల 68 వేల మార్కెట్ సెస్ వసూలు చేసినట్లు అంబాజీపేట మార్కెట్ కమిటీ కార్యదర్శి ఐ.రమేష్, చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కోస్తా ఆంధ్రాలోనే అన్ని మార్కెట్ కమిటీల కంటే ముందుగా లక్ష్యాన్ని పూర్తి చేసి స్థానిక మార్కెట్ యార్డు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. గుంటూరు మార్కెట్ సెస్ వసూళ్ల లక్ష్యం రూ.382 లక్షలుగా వార్షిక బడ్జెట్‌లో నిర్దేశించారన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ సెస్ వసూలు మూడు నెలలు ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. 2023–24, 2024–25 సంవత్సరంలో కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్దేశించిన మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని సాధించందన్నారు. లక్ష్య సాధనలో సహకరించిన వైస్ చైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
వాడపల్లివాసునికి
రూ.1.2 లక్షల విరాళం
కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద పథకానికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన మద్దేరి సురేష్ కుటుంబం రూ.1.2 లక్షలు విరాళం ఇచ్చారు. దాతకు ఈఓ స్వామి వారి చిత్రపటాన్ని అందచేశారు.
41 గ్రామాలలో రీసర్వే
అమలాపురం రూరల్: జిల్లాలో నాలుగో దశ రీ సర్వే ప్రక్రియ 41 గ్రామాలలో నిర్వహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కొత్తపేట డివిజన్‌లో 13 గ్రామాలు, అమలాపురం డివిజన్‌లో 28 గ్రామాలలో ఈ ప్రక్రియను ప్రారంభించి లక్ష్యాలు పూర్తిచేయాలన్నారు. ఈ ప్రక్రియలో భూ యాజమానులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆ దిశగా గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. సమాచారాన్ని చేర వేసి వారి సమక్షంలోనే రీ సర్వే పూర్తి చేసి కచ్చితమైన సరిహద్దులను సూచిస్తూ భూ రికార్డులను స్వీకరించి డిజిటల్ రికార్డులను రూపొందిస్తూ భావితరాలకు వివాద రహిత భూములను అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ రీసర్వే ద్వారా భూ వివరాల్ని ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో భూముల హద్దులు, విస్తీర్ణం, పాత పత్రాలు డిజిటల్ రికార్డులతో సరిపోల్చి కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు. ఏ విధమైన అనుమానాలు ఉన్నా సర్వే బృందానికి చెప్పి పరిష్కరించుకోవాలన్నారు.


