విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత

Jan 1 2026 11:28 AM | Updated on Jan 1 2026 11:28 AM

విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత

విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత

రావులపాలెం: స్థానిక ఎంకేఆర్‌ సెంటర్‌లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళితే టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గ నాయకులు స్థానిక ఎంకేఆర్‌ కల్యాణ మండపం సెంటర్‌లో మంగళవారం రాత్రి ఇటుకలతో దిమ్మ నిర్మించి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెటేందుకు యత్నించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి 100 ద్వారా ఫోన్‌ చేసి వివరించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తదుపరి నిర్మాణ పనులు నిలిపివేసి పికెట్‌ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బుధవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల ఫొటో పెట్టి దండ వేశారు. సాయంత్రం స్థానికులు ఈ విషయాన్ని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి వివరించగా ఆయన వచ్చి ఏ విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానించాక ఆ ప్రాంతంలో విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన రాగా స్థానికులు మారుతీ నగర్‌గా నామకరణంచేసి ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలని కోరారన్నారు. ఆ మేరకు ఆంజనేయస్వామి బొమ్మను, అంబేడ్కర్‌ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వాటిని కూడా పెట్టాలని జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళంలో కొందరు శ్రీకృష్ణ దేవరాయలు బొమ్మను దిమ్మపై పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు జగ్గిరెడ్డిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని జగ్గిరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈలోగా డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ అక్కడకు చేరుకుని జగ్గిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులతో చర్చించి ఆ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ చిత్రపటాన్ని, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నీ పెట్టారంటే ఇదంతా మీ మద్దతుతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హైకోర్టు ఉత్తర్వులు, పంచాయతీ తీర్మానం ఖాతరు చేయకుండా అర్థరాత్రి విగ్రహం పెట్టడం తగదని, వెంటనే ఆ విగ్రహాలను స్టేషన్‌కు తరలించి, బేషరతుగా ఆ దిమ్మను తొలగించాలని జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. చివరకు పోలీసులు విగ్రహానికి ముసుగు వేశామని, సంక్రాంతి పండగ వరకు అలానే ఉంచుతామని, ఆ తరువాత కోర్టు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సర్దిచెప్పారు. చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో మాజీ ఎంపీ చింతా అనూరాధ, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకటసతీష్‌, పాముల రాజేశ్వరి, కోర్డినేటర్లు పినిపే శ్రీకాంత్‌, గన్నవరపు శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి జున్నూరి బాబి, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్‌, అధికార యంత్రాంతం తరపున తహసీల్దార్‌ ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, సీఐ శేఖర్‌బాబు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులే దగ్గరుండి

విగ్రహం పెట్టించారని ధ్వజం

పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించిన పార్టీ శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement