కోకో పార్కులతో స్థూల జాతీయోత్పత్తి పెంపు
అమలాపురం రూరల్: వ్యవసాయ ఆధారిత కోనసీమ జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెంపుదలకు వ్యవసాయ అనుబంధ రంగాలు కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్కులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపించే దిశగా ప్రతిపాదనలకు కార్యరూపం ఇస్తున్నట్టు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. కోనసీమ ప్రాంత వాసుల స్థూల జాతీయోత్పత్తి పెంపుదలకు ఉప్పలగుప్తం, మామిడికుదురు మండలాలలో కోకో పార్కు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు నిర్మాణానికి చర్యలు సాగుతున్నాయని, ఇప్పటికే ప్రభుత్వం ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. జిల్లాలో కొబ్బరి, అరటి పరిశ్రమలు, విద్యుత్ పొదుపు, రోడ్లు అభివృద్ధి, విద్యా కార్యక్రమాల ద్వారా సాధించిన ఆర్థిక, సామాజిక పురోగతిని విశదీకరించారు. 2026వ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాలలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు 216 జాతీయ రహదారి అభివృద్ధికి గెద్దాడ వద్ద భూసేకరణను అధిగమించి రహదారి నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 46 కోట్లతో ఆర్ అండ్‌బీ రహదారుల మరమ్మతులు చేపట్టి 70 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.1650 కోట్లతో కోనసీమకు రక్షిత నీటి సరఫరా పనులు కొలిక్కి వచ్చాయని తెలిపారు. అంతర్వేది పల్లిపాలెం హార్బర్ కొత్త ఏజెన్సీకి వస్తోందని జూన్ 15 నుంచి మత్స్య సంపద ఎగుమతులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సీసీ బీటీ రోడ్లు, కాలువగట్ల బలోపేతానికి లూజు భూముల్లో జియో టెక్స్‌టైల్స్ మ్యాట్లను వినియోగించి మన్నికను మరో ఐదేళ్ల పాటు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బంది పడుతున్న 51 మందిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు తెలిపారు.
కలెక్టర్ మహేష్ కుమార్


