సీమంతా సందడి
మనిషి ఆశాజీవి. అల్ప సంతోషి. నాటి కన్నా నేడు.. నేటి కన్నా రేపు ఎంతో బాగుంటుందని కలలు కంటూనే ఉంటాడు. వంద కష్టాలు.. వెయ్యి నష్టాలు వచ్చినా ఓ చిన్న సుఖం.. మరో చిన్న లాభం వచ్చిందంటే వాటన్నింటినీ మరచి ఎగిరి గంతులేస్తుంటాడు. ఏటికేళ్లు గతించిపోతున్నాయి. వాటికి తగ్గట్టే ఆశలు.. కోరికలు తామర తంపరగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటి సాధనకే జీవితాలు సరిపోతున్నాయి. 2025 వస్తోంది.. శుభాలు తెస్తుందని ఆశించిన కొందరికి సత్ఫలితాలు.. ఇంకొందరికి మిశ్రమ ఫలితాలు.. మరికొందరికి నష్టాలు మిగిల్చి ఉండవచ్చు. 2026లో మరిన్ని శుభాలు కలగాలని కొందరు.. బాగుంటే చాలని ఇంకొందరు.. కష్ట నష్టాల నుంచి బయటపడాలని ఇంకొందరు కాంక్షిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. సర్వే జనా సుఖినోభవంతని ఆకాంక్షిస్తూ ప్రజలు వేడుకల్లో మునిగి తేలుతున్నారు.
సాక్షి, అమలాపురం: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ.. తీపి గుర్తులను మననం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో మంచి జరగాలనే ఆంక్షాలను వ్యక్తం చేస్తూ జిల్లా వాసులు కొత్త ఏడాది 2026కు ఘన స్వాగతం పలుకుతున్నారు. పాత ఏడాది ముగింపు వేడుకలు జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఉత్సాహం ఉరకలేసింది. వయసుతో సంబంధం లేకుండా అంతా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తూ జిల్లా అంతటా హోరెత్తించారు. డీజేలు.. ఆటపాటలతో కొత్త సంవత్సరానికి యువత స్వాగతం పలికింది. 2025కి బై బై.. 2026కు వెల్కమ్ అంటూ నినాదాలు హోరెత్తించారు. బుధవారం సాయంత్రం నుంచే సందడి మొదలు కాగా.. అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీలతో పాటు రావులపాలెం, కొత్తపేట, రాజోలు, మలికిపురం, తాటిపాక, అంబాజీపేట, మురమళ్ల, ద్రాక్షారామం వంటి మేజర్ పంచాయతీలలో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. సంగీతాల హోరు.. నోరూరించే విందు భోజనాలకు పలు హోటళ్లు, రెస్టారెంట్లు వేదికలయ్యాయి. రెస్టారెంట్లలోనే కాకుండా పట్టణాలు, పల్లె అనే తేడా లేకుండా సందు సందునా తాత్కాలిక బిర్యానీ సెంటర్లు వెలిశాయి. వాటి వద్ద కూడా విక్రయాలు విరివిగా సాగాయి. పలు అపార్ట్‌మెంట్లలో పిల్లలు, పెద్దలు, యువత సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అమలాపురం పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో డీజేలతో హోరెత్తించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పూల దుకాణాలు కళకళాడాయి. బొకేలు, బెంగళూరు గులాబీలు, ఆర్కెడ్‌లతో తయారు చేసిన పూలతో తయారు చేసిన పుష్పగుచ్ఛాలకు, అలంకరణ మొక్కలకు డిమాండ్ ఏర్పడింది. స్వీట్ షాపులు, బేకరీలు జనంతో కిటకిటలాడాయి.
సందట్లో సడేమియాలా..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులా పారింది. ఉదయం నుంచి మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు ముమ్మిడివరంలో మాత్రమే క్వార్టర్ బాటిల్‌కు అదనంగా రూ.పది పెంచి విక్రయించగా, న్యూ ఇయర్ వేడుకల పేరు చెప్పి జిల్లాలో పలుచోట్ల మద్యం ధరలు పెంచి విక్రయించడం గమనార్హం. సాధారణ రోజుల్లో రాత్రి పది గంటలకు దుకాణాలు మూసి వేయాల్సి ఉండగా, అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో విక్రయాలు భారీగా సాగాయి. బెల్టు షాపుల వద్ద కూడా మామూలు రోజులలో విక్రయాల ధరల కన్నా అదనపు ధరలతో మద్యం విక్రయించడంలో వినియోగదారుల జేబులు గుల్లయ్యాయి.
అమలాపురంలో ఖాళీగా ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్
అమలాపురంలో పూల దుకాణం వద్ద బొకేలు కొనుగోలు చేస్తున్న ప్రజలు
జిల్లాలో మిన్నంటిన
న్యూ ఇయర్ వేడుకలు
సాయంత్రం నుంచి
అర్ధరాత్రి వరకు జోష్
భారీగా బోకేలు..
కేకులు.. బిర్యానీ విక్రయాలు
రోడ్లపై కుర్రకారు జోరు..
అపార్ట్‌మెంట్లలో పిల్లా పెద్దా హంగామా
సీమంతా సందడి


