
● 18 మంది అరెస్ట్
● రూ.2.06 లక్షల నగదు సీజ్
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు అక్రమ రవాణాను పసిగట్టేందుకు దాడులు, తనిఖీల వేగాన్ని మరింత పెంచాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగిన దాడులు, తనిఖీల్లో అక్రమ రవాణాను అడ్డుకుని 18 మందిని అరెస్ట్ చేశారు. నగదు రూ.2.06 లక్షలు సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్‌లు, స్వాధీనాల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది.
● అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
● రావులపాలెంలో నిఘా బృందాలు వాహనాలను తనిఖీ చేసి రూ.2.06 లక్షల నగదును సీజ్ చేశారు.
● ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,220 నగదు సీజ్ చేశారు. 4 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
● రామచంద్రపురం, ద్రాక్షారామ, పామర్రు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 18.03 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
● అమలాపురం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట ముమ్మిడివరం ఎస్‌ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 83 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 15.51 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
● ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన ఐ.పోలవరం మండలం మురమళ్ల,పశువుల్లంకలలో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోంచుకునేలా భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు.