నా ప్రశ్నలకు బదులే దీ?
‘సంక్రాంతి’ అక్రమాలపై ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అమలాపురం టౌన్: ‘ఎస్.యానాం సంక్రాంతి సంబరాల ముసుగులో జరిగిన అక్రమాలపై ప్రశ్నించాను. ఆ లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నాను. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలతో ప్రతికా సమావేశాల పేరుతో ఎదురు దాడులే తప్ప ఇప్పటి వరకు నా ప్రశ్నలకు బదులు ఇవ్వలేదు. శ్వేత పత్రాన్ని విడుదల చేయలేద’ని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై మరోసారి ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడికీ ప్రశ్నించే హక్కు ఉంటుందని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణలపై, సంధించిన ప్రశ్నలపై నేటికీ కట్టుబడి ఉన్నానన్నారు. ఎమ్మెల్యే నేరుగా చర్చలకు రావాలని, నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నేరుగా చర్చకు వస్తే తాను సిద్ధమని చెప్పారు. ‘రాజు గారి చేపల చెరువు ఉంటుంది. అందులో చేపలు ఉండవు. త్వరలోనే ఈ చేపల చెరువు కథను మొత్తం బయటపెడతా’నని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ వ్యాఖ్యానించారు.
9లోపు పట్టాదారు
పాస్ పుస్తకాల పంపిణీ
అమలాపురం రూరల్: ఈ కేవైసీ పూర్తిచేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఫిబ్రవరి 9లోపు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి అమరావతి నుంచి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పాస్‌బుక్కులు పంపిణీ చేయాలన్నారు.
అభివృద్ధి పనులను
అందుబాటులోకి తేవాలి
అమలాపురం రూరల్: ఉపాధి హామీ అనుసంధానంతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తిచేసి ఆయా వసతులను ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంజీఎన్‌ఆర్ ఈజీఎస్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారి బి.గోపీచంద్ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో 385 గ్రామ పంచాయతీలలో నరేగా అనుసంధానంతో చేపట్టిన అభివృద్ధి మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రూ.60 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులను మార్చి 31లోగా పూర్తి చేసి బిల్లులు ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్(గ్రామీణ్) వీబీ జీ రామ్ జీపై ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి నూతన పథకం అమల్లోకి వస్తుందన్నారు. డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృష్ణారెడ్డి, ఏపీడీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీపుష్పోత్సవం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలోని మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీపుష్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణ మూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లకు ఆలయ ఈఓ, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శాస్త్రోక్తంగా పుష్పోత్సవం నిర్వహించారు. పుణ్య దంపతులకు తాంబూలాలు అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నా ప్రశ్నలకు బదులే దీ?
నా ప్రశ్నలకు బదులే దీ?


