
విలేకరులతో మాట్లాడుతున్న ఈఓ తారకేశ్వరరావు
ఈఓ తారకేశ్వరరావు
రామచంద్రపురం రూరల్: త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 30 వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబా అమ్మవార్ల గర్భాలయాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి అందజేసిన నర్మద బాణ లింగానికి, శ్రీ చక్ర యంత్రానికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకాలు, కుంకుమార్చనలు ఉదయం 10 గంటలకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు స్వామి, అమ్మవార్లకు ప్రతి నిత్యం ఆర్జిత సేవలు, నిత్య కై ంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు.
పోక్సో కేసులో జీవిత ఖైదు
గోపాలపురం: పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు గోపాలపురం ఎస్పై కర్రి సతీష్‌కుమార్ శుక్రవారం తెలిపారు. తూర్పుగోదగోపాలపురం పెద్దగూడెం కాలనీకి చెందిన ముప్పడి సంపత్‌రావు(75)పై 2017లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద తీర్పు చెప్పినట్లు తెలిపారు. ముద్దాయికి జీవిత కాల శిక్షతో పాటు రూ.వేయి జరిమానా, బాధితురాలికి రూ.2లక్షల 50వేలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు.