
సాక్షి అమలాపురం: జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ఇద్దరు సాధారణ పరిశీలకులు, ముగ్గురు వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేశ్వర్ గోయల్ (ఐఏఎస్), ప్రదీప్ కుమార్ (ఐఏఎస్) సాధారణ పరిశీలకులుగా, ఉమేష్ కుమార్ (ఐఆర్‌ఎస్) పార్లమెంట్ స్థానానికి వ్యయ పరిశీలకులుగా, రాహుల్ ధింగ్రా (ఐఆర్‌ఎస్), సుమిత్ దాస్ గుప్తా (ఐఆర్‌ఎస్)లను ఏడు అసెంబ్లీ స్థానాలకు వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించిందన్నారు.
ఎన్నికలు నిష్ఫక్షపాతంగా నిర్వహించాలి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉమేష్‌కుమార్ తెలిపారు. అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, ఫ్లయింగ్ బృందాలతో కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖర్చుల గణనపై అవగాహన కల్పించారు. ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చేపట్టిన గణాంకాలపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో వ్యయ పరిశీలకుడిగా పనిచేశానని సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బృందాలు కృషి చేయాలన్నారు. అనుమతులు సక్రమంగా లేని పక్షంలో వాహనాలు ఆర్వో ద్వారా సీజ్ చేయించాలని సూచించారు. నగదు అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. రూ10 లక్షలు దాటి నగదు రవాణా అవుతున్నట్లయితే నగదు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం విక్రయాలు లిక్కర్ షాపుల ద్వారా ఎన్నికల సమయంలో పెరిగినట్టు గుర్తిస్తే నిఘా మరింత పెంచాలన్నారు. అభ్యర్థుల ఊరేగింపులు ర్యాలీలు, బహిరంగ సభల వీడియోలను సక్రమంగా చిత్రీకరించి అకౌంటింగ్ టీమ్‌కు అందించాలని, అకౌంటింగ్ టీం నిర్దేశిత రేట్ల ప్రకారం అభ్యర్థులకు సంబంధించిన వ్యయాలను గణించాలని సూచించారు. నామినేషన్లు వేసిన తేదీ నుంచి మరింత అప్రమత్తంగా గణాంకాలు చేపట్టాలన్నారు. బ్యాంకులలో నగదు లావాదేవీలు రోజువారీ నివేదికను జిల్లా ఎన్నికల అధికారి ఎల్‌డీఎంకు సమర్పించాలని సూచించారు. మరో వ్యయ పరిశీలకులు రాహుల్ ధింగ్రా మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం, నగదు, ఉచిత వస్తువులు పంపిణీ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాధారణ ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడుకున్నాయని, అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం పరిమితి విధించినందున ఆ ప్రకారం మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం, నోడల్ అధికారి మురళీకృష్ణ, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్‌రావు పాల్గొన్నారు.
అధికారి పేరు కేటాయించిన స్థానం సెల్ నెం.
రాజేశ్వర్ గోయిల్ జనరల్ అబ్జర్వర్ 89789 62588
ప్రదీప్ కుమార్ జనరల్ అబ్జర్వర్ 89775 02588
ఉమేష్ కుమార్ వ్యయ పరిశీలకులు 78935 12588
రాహూల్ ధింగ్రా వ్యయ పరిశీలకులు 89784 52588
సుమిత్ దాస్ గుప్తా వ్యయ పరిశీలకులు 73308 62588