
ఏడీబీ రోడ్డులో సీఎం బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం
రాజానగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఏడీబీ రోడ్డును అనుకుని ఎస్టీ రాజాపురం వద్ద రాత్రి బస చేయనున్నారు. ఇందుకు సంబంధించి పటిష్టమైన బందోబస్తుతోపాటు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎస్పీ పి.జగదీష్‌తోపాటు సీఎం భద్రతా సిబ్బంది, సెంట్రల్ డివిజన్, నార్త్, ఈస్ట్ డీఎస్పీలు, స్థానిక సీఐ, తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కడియపులంకలో సీఎం భోజన విరామం
కడియం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కడియం మండలం రానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి జాతీయ రహదారి మీదుగా వస్తున్న ఆయన పొట్టిలంక వద్ద కడియం మండలంలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కడియపులంక చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విరామం కోసం ఆగే ప్రాంతంలో సీఎం బస్సు, కాన్వాయ్ ట్రయల్ రన్‌ను కూడా అధికారులు పర్యవేక్షించారు. పొట్టిలంక నుంచి హైవేపై కుడివైపునకు సీఎం కాన్వాయ్‌ని మరల్చి, కడియపులంకలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకురానున్నారు. సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్, కడియం ఎంపీడీఓ జి.రాజ్‌మనోజ్ ఇతర అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.