
రత్నగిరిపై వార్షిక కల్యాణ మంటపంలో శ్రీసీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పండితులు
అన్నవరం : రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారాముల దివ్యకల్యాణం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం రత్నగిరి రామాలయం పక్కన గల వార్షిక కల్యాణ వేదికపై వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఉదయం పది గంటల నుంచి 12–30 గంటల వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత ప్రముఖుడు, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితర పండితులు నిర్వహించారు.
వెండి పల్లకిపై ఊరేగింపు
ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వధూవరులు శ్రీసీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ప్రత్యేక సింహాసనం మీద సీతారాములను పండితులు ఉంచారు. ఆ సింహాసనం పక్కనే గల మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు అమ్మవార్లను ఉంచారు. ఉదయం 10–15 గంటలకు విఘ్నేశ్వరపూజతో సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ఈఓ కె.రామచంద్రమోహన్ సీతారాములకు నూతన పట్టువస్తాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల తల్లితండ్రులు, వారి గోత్రనామాలతో కూడిన ప్రవరను ఛామర్తి కన్నబాబు వివరించారు.
తరువాత పుణ్యాహవచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్య ధారణ, వైభవంగా తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్‌లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు వేదపండితులు ఆశీస్సులందజేశారు. తరువాత సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణం సమయంలో భక్తులకు ఆచారం ప్రకారం తాటియాకుల విసనకర్రలు పంపిణీ చేశారు. శ్రీసీతారాముల కల్యాణం అనంతరం శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు నిత్య కల్యాణం అదే వేదికపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2–30 గంటల వరకు నిర్వహించారు. ఆలయ ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన
సత్యదేవుడు, అమ్మవారు
పట్టువస్త్రాలు, ముత్యాల
తలంబ్రాలు సమర్పించిన ఈఓ
కల్యాణానికి ముందు
కన్నుల పండువగా ఊరేగింపు

సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఈఓ రామచంద్రమోహన్