
విద్యుద్దీపాలతో కాంతులీనుతున్న వాడపల్లి క్షేత్రం
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి వారం రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలను ప్రారంభిస్తారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి.
భక్తులకు వసతులు
కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్ల వేయించారు. అక్కడ గాలి కోసం ఫ్యాన్లు అమర్చారు. స్వామివారి దర్శనానికి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు కట్టారు. లొల్ల నుంచి వాడపల్లి వరకూ అడుగడుగునా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలను ఏర్పాటు చేశారు. వాడపల్లి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారుగా 50 వేల లడ్డూలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు.
24న శ్రీపుష్పోత్సవంతో పూర్తి
ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ కార్యక్రమంతో గురువారం వాడపల్లి తీర్థ మహోత్సవం ప్రారంభమవుతుంది. శుక్రవారం రథోత్సవం, రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున ఆర్‌డీవో సత్యనారాయణ నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.01 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి ఆగమన శాస్త్ర ప్రకారం కల్యాణ ఘట్టాన్ని వేదమంత్రోచ్ఛారణలతో జరుపుతారు. 20న పొన్నవాహన మహోత్సవం, 21న సదశ్యం, 22న స్వామివారికి ప్రత్యేక పూజలు, గౌతమి గోదావరిలో సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 23న గౌతమి గోదావరిలో భక్తుల సమక్షంలో స్వామివారికి చక్రతీర్థస్నానం జరుగుతుంది. 24న జరిగే శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
నేటి నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు
భక్తుల కోసం సర్వం సిద్ధం

ప్రత్యేక అలంకరణలో వాడపల్లి వేంకటేశ్వరస్వామి