ముమ్మిడివరం: ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యాన జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీర్ సర్వీసెస్ ద్వారా స్థానిక ఉషా కిరణ్ ఐటీఐలో శనివారం మినీ జాబ్‌మేళా నిర్వహించారు. వివిధ పోస్టుల భర్తీకి ఐదు సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొన్నారు. 126 మంది నిరుద్యోగులు హాజరు కాగా, వీరిలో 53 మంది తదుపరి దశకు ఎంపికయ్యారని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇ.వసంతలక్ష్మి తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసెస్ ద్వారా ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిరుద్యోగులకు
ఉచిత శిక్షణ
ముమ్మిడివరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో స్కిల్ హబ్‌ల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రెండో దశ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోక్‌మాన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ శిక్షణకు అమలాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమల సహకారంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. మూడు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తారక్‌ను 86396 50329, పి.గన్నవరం కో ఆర్డినేటర్ ప్రసాద్‌ను 77801 32656, రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘువర్మను 99484 04165 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని లోక్‌మాన్ సూచించారు.
బాలబాలాజీ స్వామికి
రూ.3.26 లక్షల ఆదాయం
మామిడికుదురు: పవిత్ర కార్తిక మాసం కావడంతో అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. పావన వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కెలు నెరవేర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. వేకువజామున వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. స్వామి సన్నిధిలో నిర్వహించే హోమం వైభవంగా జరిపించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.3.26 లక్షల ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.43 లక్షలు, నిత్యాన్నదానానికి విరాళాలుగా రూ.83,340 చొప్పున వచ్చాయి. స్వామివారిని 4,591 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 3,624 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చిట్టూరి రామకృష్ణ, ఈఓ జి.శ్రీదేవి, ట్రస్టు బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.
28న నిధి ఆప్‌కే నిఖత్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు నిధి ఆప్‌కే నిఖత్ – డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ వైడీ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని హిందూస్థాన్ లీవర్ లిమిటెడ్, రాజమహేంద్రవరం మల్లయ్యపేట పేపరు మిల్లు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యానాం వెంకటసాయి పొలిమర్స్, కాకినాడ జిల్లాకు తుని ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. అడ్వాన్సులు, మోసాలు, కేవైసీ నేపథ్యంలో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు, కొత్తగా చేరిన ఎస్టాబ్లిష్‌మెంట్లు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవాలని శ్రీనివాస్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment