ఇంట్లోకి వెళ్లేందుకు బైబై చెబుతావు ఏంట్రా.. ఇంతలోనే షాకింగ్‌ ఘటన

Youth Commits Suicide Due To Financial Difficulties In Vizag - Sakshi

మల్కాపురం(విశాఖపట్నం): తన తల్లిని టీ చేయమని అడిగాడు..తల్లి ఇచ్చిన టీ తాగాడు. సరే మమ్మీ బాయ్‌ అన్నాడు.. అంతలోనే తన గదిలోకి వెళ్లి తల్లి చీరతోనే ఊరి పోసుకుని మృతి చెందాడు. అంత వరకు సరదాగా గడిపిన కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోదించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు .. జీవీఎంసీ 62వ వార్డు అల్లూరి సీతారామరాజుకాలనీ( ఏఎస్‌ఆర్‌కాలనీ) ప్రాంతంలో గట్ట రాజేష్‌ ( 25) తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాజేష్‌ తన స్నేహితుల కోసం తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేశాడు.
చదవండి: అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ 

దీనికి తోడు తండ్రి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఇంటి అవసరాల కోసం మరి కాస్తా అప్పు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు పదే పదే డబ్బులు అడగడంతో వేరే దారి లేక చనిపోదామని రెండు వారాల కిందట నిర్ణయించుకున్నాడు. దీంతో రాజేష్‌ దిగాలుగా  ఉంటున్నాడు. ఇది గుర్తించిన తల్లి స్థానికంగా ఓ పాస్టర్‌ వద్దకు తీసుకువెళ్లి ఆయన చేత ధైర్యం చెప్పించింది. ఇది ఇలా ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తల్లిని టీ అడిగాడు. తల్లి చేతితో ఇచ్చిన టీ తాగిన రాజేష్‌ తన గదిలోకి వెళ్లేముందు బై బై మమ్మీ అని చెప్పాడు.

ఇంట్లోకి వెళ్లేందుకు బైబై చెబుతావు ఏంట్రా అని ప్రశ్నించింది. దానికి నవ్వుతూ గదిలోకి వెళ్లి పోయిన రాజేష్‌  తల్లి చీరతో ఫ్యాన్‌ హుక్కుకు ఊరిపోసుకున్నాడు. ఆ సమయంలో తండ్రి విధుల నుంచి వచ్చి రాజేష్‌ ఏడి అని అడిగాడు. ఈ క్రమంలో గది వద్దకు వెళ్లగా వేలాడుతున్న కుమారుడిని చూసి కేకలు వేయడంతో తల్లి అక్కడకు చేరుకుంది. ఇద్దరూ కిందకు దించి కాపాడే ప్రయత్నం చేశారు.కానీ ఫలితం దక్కలేదు. దీంతో వారు మల్కాపురం పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు ఘటన స్థలానికి వచ్చి  ఆరా తీశారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top