యువతీ యువకుడి అత్మహత్య.. ఒకరు చదువు కోసం, మరొకరు ఉద్యోగం కోసం.. | Youth And Girl Suicide On Railway Track Spsr Nellore | Sakshi
Sakshi News home page

యువతీ యువకుడి అత్మహత్య.. ఒకరు చదువు కోసం, మరొకరు ఉద్యోగం కోసం..

Jun 12 2022 10:48 AM | Updated on Jun 12 2022 11:22 AM

Youth And Girl Suicide On Railway Track Spsr Nellore - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,నెల్లూరు(క్రైమ్‌): యువతీ, యువకుడు రైలు కిందపడి తనువు చాలించిన సంఘటన నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో రైలు పట్టాలపై శనివారం వెలుగులోకి వచ్చింది. రైల్వే, స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి(21) ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈనెల 10వ తేదీన కళాశాలకు వెళ్లేందుకు ఆమెను తండ్రి అయ్యప్పగుడి సెంటర్‌లో వదలివెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. రాత్రయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి శనివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా డైకస్‌రోడ్డుకు చెందిన జి.నితిన్‌(27) బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అతను ఈనెల 10వ తేదీన ఇంటర్వ్యూ నిమిత్తం సూళ్లూరుపేటకు వెళ్తున్నట్లు ఇంటి నుంచి వచ్చాడు. రాత్రయినా అతను ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు సైతం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 10.30 ప్రాంతంలో కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలు పట్టాలపై యువతీ, యువకుడి మృతదేహాలను స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి వారు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలంలో లభ్యమైన వివరాలు, బైక్‌ ఆధారంగా మృతులు భాగ్యలక్ష్మి, నితిన్‌గా గుర్తించారు. వారి  కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement