అమ్మా.. పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా!

Young man Committed Suicide by Drinking insecticide in Jannaram - Sakshi

సాక్షి, మంచిర్యాల: ‘ఉద్యోగం రాదోమోననే భయంతో పురుగుల మందు తాగిన.. అమ్మా.. నన్ను క్షమించమ్మా? అని ఆ కొడుకు చివరిసారిగా మాట్లాడిన మాటలు ఆ కన్నతల్లి జీర్ణించుకోలేకపోతోంది. చేతికందిన కొడుకు చేదోడువాదోడుగా ఉంటాడనుకుంటే అర్ధంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

మృతుడి తండ్రి, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన దాసరి శేఖర్‌–సుజాత దంపతులకు కొడుకు శ్రీకాంత్‌ (25), కూతురు ఉన్నారు. కూతురుకు వివాహం జరిపించారు. శ్రీకాంత్‌ బీటెక్‌ చదివాడు. ఇటీవల ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాడు. తక్కువ మార్కులు వస్తాయని భావించి ఉద్యోగం రాదని దిగులు చెందాడు. ఇదే బెంగతో ఈనెల 10న రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంట్లో పురుగుల మందు తాగాడు.

‘పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి.. ఉద్యోగం రాదేమోననే భయంతో పురుగుల మందు తాగిన.. నన్ను క్షమించమ్మా’ అని తల్లి సుజాతతో చివరిసారిగా మాట్లాడాడు. అంతలోనే అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మేదరిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనగర్‌ ఆస్పత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఎదిగివచ్చిన కొడుకుపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు చివరి మాటలు తలుచుకుని రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.  మృతుడి తండ్రి శేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తానాజీ తెలిపారు.

చదవండి: (Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top