Warangal: Woman Supari To Assassination Of Shop Owner, viral- Sakshi
Sakshi News home page

రమ పథకం బెడిసికొట్టింది.. అసలు ఏం జరిగిందంటే..?

Published Fri, Jan 14 2022 12:52 PM

Woman Supari To Assassination Of Shop Owner Warangal - Sakshi

Warangal: ఎదురెదురుగా ఉన్న చిరు దుకాణాల వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోటీగా ఉన్న దుకాణాదారున్ని ఎలాగైన దెబ్బతీయాలనే ఉద్దేశంతో మహిళ ప్లాన్‌ చేసింది. వరంగల్‌కు చెందిన ఐదుగురికి రూ. 25వేలు ఇచ్చి సుపారికి ప్లాన్‌ చేసి దుకాణదారున్ని కొట్టి బెదిరించడానికి వచ్చి గొడవ జరుగగా ప్లాన్‌ బెడిసి కొట్టి సుపారి గ్యాంగ్‌లో ఒకరు దుకాణాదారు చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో చోటుచేసుకుంది. మహదేవపూర్‌ సీఐ కిరణ్‌కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. కాళేశ్వరంలో ఎదురెదురుగా ఉన్న చిరు దుకాణదారులు వంగల శ్రీనివాస్, చల్ల రమలు ఒకరిపై ఒకరు కస్టమర్ల విషయంలో ద్వేషం పెంచుకున్నారు.

దీంతో 20 రోజులు కిందట ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీనివాస్‌ను దెబ్బతీసి కొట్టించాలని రమ పథకం వేసింది. దీంతో తనకు పరిచయమున్న వరంగల్‌కు చెందిన వంశీని ఆశ్రయించింది. రూ. 25వేలు అతనికి ఇచ్చి శ్రీనివాస్‌ను కొట్టి, భయపెట్టాలని చెప్పింది. వంశీ స్నేహితులైన వంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం రంగశాయిపేటకు చెందిన ఎండీ అస్లాం, ఎస్‌కే వాసీమోద్దీన్, ఎండీ అల్తాఫ్, వెంకట్‌లను ఈ నెల 6 గురువారం కాళేశ్వరానికి రప్పించారు. అక్కడ పీకల్లోతు మద్యం సేవించారు. తర్వాత శ్రీనివాస్‌ దుకాణం వద్దకు రాత్రి వెళ్లి సిగరెట్‌ ధర విషయంలో గొడవకు దిగారు.

దీంతో శ్రీనివాస్‌ను ముందుగా వీరు గ్యాస్‌స్టవ్‌తో కొట్టారు. అనంతరం అతని భార్య కస్తూరితో కలిసి ఇద్దరూ ఆ నలుగురు వ్యక్తులపై ఎదురు దాడి చేశారు. అందులో సాయితేజ అనే యువకున్ని గ్యాస్‌స్టవ్‌తో తలపై మోదగా అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, శ్రీనివాస్, అతని భార్య కస్తూరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎదురుగా ఉన్న దుకాణందారుతో తమకు గొడవలు ఉన్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న దుకాణందారు చల్ల రమను అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలు బయటపడినట్లు సీఐ కిరణ్, ఎస్సై లక్ష్మణ్‌రావులు పేర్కొన్నారు. గొడవతో పాటు హత్య కేసులో ఉన్న భార్యభర్తలు, సుపారి గ్యాంగ్‌ ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement