లైంగిక దాడి కేసు: ముగ్గురు ఆటో డ్రైవర్ల రిమాండ్‌ 

Woman Molested Case: Auto Drivers Remand At Rajendranagar - Sakshi

రాజేంద్రనగర్‌: ఇంటి వద్ద దింపుతామని ఆటోలో తీసుకువెళ్ళి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు బాధితురాలి సెల్‌ఫోన్, రోల్డ్‌ గోల్డ్‌ చైన్, పర్సును స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య తెలిపిన మేరకు..  పురానాపూల్‌ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల వివాహిత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉండటంతో హైదర్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి కల్లు తాగి ఇంటికి తిరిగి వెళ్ళేది.

ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదర్‌గూడ కంపౌండ్‌కు వచ్చింది. ఇదే సమయంలో కూకట్‌పల్లి వివేక్‌నగర్‌కు చెందిన  ఆటో డ్రైవర్‌ నర్సింగ్‌రావు(32), జగద్గిరిగుట్టకు చెందిన నరేష్‌(31), బాలానగర్‌కు చెందిన ప్రసాద్‌(35) లు వచ్చారు. ఈ ముగ్గురూ మహిళతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నారు.   తాము కూడా ఆటోలో పురానాపూల్‌ వైపు వెళ్తున్నామని ఇంటి వద్ద దించేస్తామని నమ్మించారు.  అత్తాపూర్‌ మీదుగా తిరిగి రాజేంద్రనగర్‌ వైపు ఆటోను మళ్లించడంతో ఆ మహిళ ఎక్కడకు తీసుకువెళ్తున్నారని అడగడంతో హోటల్‌లో బిర్యానీ తిని వెళదామని తెలిపారు.

హిమాయత్‌సాగర్‌ లార్డ్స్‌ కళాశాల వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి సెల్‌ఫోన్, మెడలోని రోల్డ్‌ గోల్డ్‌ చైన్, పర్సును తీసుకోని ఆటోలో పరారయ్యారు. అర్ధరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో బాధితురాలు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కల్లు కంపౌండ్‌తో పాటు ప్రధాన రహదారులు, హోటల్, హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల ఆటో నెంబర్‌ను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top