Yellaredyy Crime: ‘దృశ్యం’ సినిమాను తలపించిన సంఘటన.. ప్రియుడితో కలిసి భర్తను చంపి..

Wife Kills Husband With Lover in Yellareddy - Sakshi

ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య 

ఏమీ ఎరుగనిదానిలా అత్తారింటికి..  

ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపి పనిచేస్తున్న స్థలంలోనే పాతిపెట్టింది. ఆపై భర్త సోదరుడికి ఫోన్‌ చేసి అక్కడికి వచ్చాడా అని ఆరా తీసింది. అనంతరం ఏమీ ఎరుగని దానిలా అత్తారింటికి చేరింది. అనుమానం వచ్చి మృతుడి కుటుంబ సభ్యులు నిలదీయగా ఘాతుకం బయటపడింది. దృశ్యం సినిమాను పోలిన ఈ సంఘటన గురువారం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

సాక్షి, కామారెడ్డి(ఎల్లారెడ్డి): కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్‌(26)కు వికారాబాద్‌ జిల్లా బషీ రాబాద్‌ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరు నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు ప్రాంతంలోని లింగంపల్లి శివారుకు కూలీలుగా వలసవచ్చారు. అక్కడ దౌల్తాబాద్‌ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో స్వగ్రామానికి తిరిగివెళ్లారు. రమేశ్‌ కుటుంబ సభ్యులకు వెన్నెల వివాహేతర సంబంధం గురించి తెలియడంతో ఇద్దరికీ సర్దిచెప్పారు. అనంతరం వారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వచ్చి పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. వెన్నెల ఎల్లారెడ్డిలో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ప్రియుడు రెండుమూడుసార్లు వచ్చి కలిశాడు.

చదవండి: (భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం)

గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో అతడు రమేశ్‌ కంటపడ్డాడు. దీంతో దస్తప్ప అతడి గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్యకు సహకరించింది. అనంతరం మృతదేహాన్ని వారు పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్‌ అన్న వెంకటప్పకు ఫోన్‌ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పింది.

మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది. అనుమానించిన రమేశ్‌ కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మృతుడి అన్న వెంకటప్ప గురువారం ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్‌ మునీరుద్దీన్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి, మృతుడి బంధువులకు అప్పగించారు. రమేశ్‌ను హతమార్చిన వెన్నెల, దస్తప్పలకోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి: (హైదాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top