కాపురానికి తీసుకెళ్లిన రాత్రే దారుణం.. | Wife Assassinated By Husband In PSR Nellore District | Sakshi
Sakshi News home page

కాపురానికి తీసుకెళ్లిన రాత్రే దారుణం..

Jan 31 2021 7:53 AM | Updated on Jan 31 2021 2:28 PM

Wife Assassinated By Husband In PSR Nellore District - Sakshi

బాగా చూసుకుంటానని పెద్దలను ఒప్పించి కాపురానికి తీసుకెళ్లిన రాత్రే ఆమె గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు.

సాక్షి,  కొడవలూరు: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నామని చెప్పి పెద్దలను ఒప్పించారు. కులాలు వేరైనా తల్లిదండ్రులు అంగీకరించి వారిద్దరికీ వివాహం చేశారు. రెండు నెలలు భార్యతో కాపురం చేసిన భర్త ఆ తరువాత నుంచి ఆమెపై అనుమానం పెంచుకుని దూరంగా ఉంటున్నాడు. తాను మారానని భార్యను బాగా చూసుకుంటానని పెద్దలను ఒప్పించి కాపురానికి తీసుకెళ్లిన రాత్రే ఆమె గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన కొడవలూరు మండలం ఎన్టీఆర్‌ నగర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లాప్రోలు వడ్డిపాళేనికి చెందిన కోడి హరికృష్ణ కోవూరులోని ఓ స్వీట్‌ దుకాణంలో పని చేస్తున్నాడు.

కొడవలూరు మండలం గండవరం శివపురం గిరిజన కాలనీకి చెందిన గడ్డం స్రవంతి(19) నార్తురాజుపాళెంలోని ఓ స్వీట్‌ దుకాణంలో పని చేస్తోంది. ఇరువురు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఈ విషయం స్రవంతి తన తల్లిదండ్రులు పద్మ, రమణయ్యకు తెలుపగా, కులాలు వేరైనా వారు అంగీకరించారు. గతేడాది జూన్‌ 10న పల్లాప్రోలు రామాలయంలో ఇద్దరికీ వివాహం చేశారు. వివాహం జరిగిన తరువాత రెండ్రోజులు మాత్రం స్రవంతిని పల్లాప్రోలులో ఉంచిన హరికృష్ణ ఆషాడ మాసం పేరుతో మరుసటి రోజు పుట్టింట్లో వదిలేశాడు. రెండు నెలలు వస్తూపోతూ, ఆ తరువాత ఆమెపై అనుమానం పెంచుకుని   రావడం    మానేశాడు.  

పెద్దలను ఒప్పించి తీసుకెళ్లి హతం
నాలుగు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న స్రవంతికి ఫోన్‌ కూడా చేయని హరికృష్ణ భార్యను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. స్రవంతి పెద్దమ్మ తలపల కృష్ణమ్మ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలులో ఉంటోంది. అక్కడికి ఈ నెల 27న స్రవంతి తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లాడు. తన భార్యను కాపురానికి పంపిస్తే బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పి నమ్మించాడు. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఆ సమయంలో పల్లాప్రోలుకు వద్దని చెప్పారు. కొడవలూరు మండలం ఎన్టీఆర్‌నగర్‌లోని స్రవంతి అక్క దాసరి ఇందిర ఇంటి తాళాలు ఇచ్చి రాత్రి అక్కడ ఉండి శనివారం ఉదయం వెళ్లాలని సూచించారు.

ఇదే అదనుగా భావించిన హరికృష్ణ ఎన్టీఆర్‌ నగర్‌లోని ఇందిర ఇంటికి భార్యతో వచ్చి అర్ధరాత్రి సమయంలో ఆమె గొంతు కోసి హతమార్చి పరారయ్యాడు. కొట్టాలులోనే స్రవంతి తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఇందిర శనివారం ఉదయం ఎన్టీఆర్‌ నగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా బయట గడి పెట్టి ఉంది. అనుమానంతో గడి తీసి లోపల చూడగా స్రవంతి అతి కిరాతకంగా హత్యకు గురై ఉంది. దిగ్భ్రాంతికిలోనైన ఆమె పోలీసులకు సమాచారం అందించారు. కోవూరు సీఐ కే రామకృష్ణారెడ్డి, కొడవలూరు ఎస్సైలు పీ శ్రీనివాసులురెడ్డి, జీ.సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement