ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు! | Sakshi
Sakshi News home page

ఇద్దరూ తోడుగా వెళ్లారు.. ఒక్కరే తిరిగొచ్చారు!

Published Tue, Mar 16 2021 11:15 AM

Vizianagaram: Man Assassinated Under The Influence Of Alcohol - Sakshi

సాక్షి, విజయనగరం : ఇద్దరూ కలిసి పక్కగ్రామంలోని మద్యం దుకాణానికి వెళ్లారు. మద్యం కొనుగోలు చేశారు. తిరిగి వస్తూ దారిలోని ఓ చెరువు వద్ద మద్యం తాగుతూ ఘర్షణ పడ్డారు. ఇందులో తాపీమేస్త్రి హత్యకు గురైన ఘటన బాడంగి మండలం రేజేరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బొబ్బలి రూరల్‌ సీఐ శోభనబాబు తెలిపిన వివరాలు ఇలా.. రేజేరు గ్రామానికి చెందిన తాపీమేస్త్రి బొందు సూర్యనారాయణ(35), అదే గ్రామానికి చెందిన బడే అప్పలనాయుడు కలిసి ఆదివారం మధ్యా హ్నం వాడాడ గ్రామానికి వెళ్లారు. అక్కడి మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశారు. తిరిగి గ్రామానికి వస్తూ మధ్యలోని ఎర్రబంద వద్ద ఆగి మద్యం సేవించారు. ఈ దశలో తన పశువుల శాల నిర్మాణం కోసం అడ్వాన్స్‌ తీసుకుని పనిలోకి ఎందుకు రాలేదంటూ మేస్త్రి సూర్యనారాయణను అప్పలనాయుడు ప్రశ్నించాడు.

ఈ విషయంపై ఇద్దరిమధ్య మాటామాటా పెరిగింది. ఘర్షణ పడ్డారు. తాగిన మత్తులో తొలుత మేస్త్రి సూర్యనారాయణ మద్యంసీసాతో అప్పలనాయు డు చేతిపై గాయపరిచాడు. వెంటనే అప్పలనాయుడు అక్కడే ఉన్న వల కర్రతో బలంగా మేస్త్రి తలవెనుక భాగంలో కొట్టడంతో నేలపై పడిపోయాడు. మృతి చెందినట్టు నిర్ధారించి మృతదే హాన్ని ఎర్రబందలోని రెల్లిపొదలు పక్కన పడేసి రెల్లిగడ్డి కప్పాడు. ఏమీ తెలియనట్టు రాత్రంతా ఇంటికి వెళ్లకుండా గ్రామ పొలిమేరలో గడిపాడు. సోమవారం ఉదయం మేస్త్రి బంధువులు వీరిద్దరి గురించి వాకబుచేస్తున్న విషయం తెలుసుకుని భయంతో బాడంగి పోలీస్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. బొబ్బిలి రూరల్‌ సీఐ, ఎస్‌ఐలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మృతునికి  ఇద్దరి మహిళలతో వివాహం జరిగినా ఆయన వద్దలేరు. తల్లి, సోదరుడు వద్దే ఉంటున్నాడు.  

చదవండి: సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు..
‘కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ’ వీడింది

Advertisement
Advertisement