చెడ్డీ గ్యాంగ్‌ చిక్కింది!

Vijayawada Police Arrest Cheddi Gang Members In Gujarat - Sakshi

పోలీసుల అదుపులో రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురు సభ్యులు 

గుజరాత్‌లోని దాహోద్‌ ప్రాంతంలో  అదుపులోకి తీసుకున్న వైనం 

వారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం 

విజయవాడ నుంచి గుజరాత్‌కు వెళ్లిన రెండు పోలీసు బృందాలు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరుస దొంగతనాలతో సంచలనం రేపిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుల ఆగడాలకు విజయవాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. గుజరాత్‌లో రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించి, నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌లో మిగిలిన సభ్యుల కోసం అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ గ్యాంగ్‌ చోరీ చేసిన సమయంలో సీసీ ఫుటేజీలో వీరి చిత్రాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలను మధ్యప్రదేశ్, గుజరాత్‌ పోలీసులకు ఇక్కడి పోలీసులు పంపగా.. గుజరాత్‌ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ చిత్రాలను ధ్రువీకరించి, వారి రాష్ట్రంలో దాహోద్‌ ప్రాంతంలోని చెడ్డీ గ్యాంగ్‌గా నిర్ధారించారు.

దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా, దాహోద్‌ ప్రాంత ఎస్పీతో మాట్లాడారు. వారి ఆట కట్టించేందుకు విజయవాడ నుంచి పోలీసు బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం శనివారం సాయంత్రానికి అక్కడికి చేరుకొంది. రెండు గ్యాంగ్‌లలో ఇద్దరు సభ్యులను పట్టుకుంది. మిగిలిన సభ్యులను పట్టుకొని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేందుకు వీలుగా.. మరొక పోలీస్‌        బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం మంగళవారం రాత్రికి అక్కడికి చేరింది.  

రెండు గ్యాంగ్‌లు.. 
విజయవాడలోని చిట్టినగర్, పోరంకి, ఇబ్రహీం    పట్నంలోని గుంటుపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి ప్రాంతాల్లో జరిగిన ఐదు దొంగతనాల్లో సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర సాంకేతికత ఆధారంగా రెండు గ్యాంగ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు నిర్ధారించారు. వీరి కదలికలపై నిఘాను పెట్టారు. సీపీ టీకే రాణా స్వయంగా  ఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. గుణదల, మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. శివారు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా తమ ప్రాంతాల్లో తిరిగితే 100 కాల్‌ సెంటర్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని విస్తృత ప్రచారం చేశారు. శివారు ప్రాంతాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, గ్రూపు హౌస్‌ల్లో ఉండే వాచ్‌మెన్‌లకు, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి, రాత్రి వేళ్లలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. అంతేకాక కమిషనరేట్‌ పరిధిలో 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి శివారు ప్రాంతాల్లో 10 పెట్రోలింగ్‌ వాహనాల ద్వారా గస్తీని ముమ్మరం చేశారు. డీసీపీలు హర్షవర్థన్‌రాజు, బాబూరావు, క్రైం బ్రాంచ్‌ ఏడీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నిరంతరం పర్యవేక్షించారు.  

వరుస దొంగతనాలతో బెంబేలు.. 
నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్‌ 7వ తేదీ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్‌ ఐదు ప్రాంతాల్లో దొంగతనాలకు యతి్నంచడంతో, శివారు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ పరిణామాలు ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన సీపీ కాంతిరాణాకు పెను సవాల్‌గా మారాయి. దీంతో ఆయన ఈ ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులను పట్టుకోవడం ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు.  

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top