చేతులు కట్టేసి డిగ్రీ విద్యార్థిని తోటలో పడేసిన దుండగలు

Unknown Tied Girl And Leaves In Open Place In Vizianagaram - Sakshi

అచేతన స్థితిలో పొదల్లో కనిపించిన డిగ్రీ విద్యార్థిని

ఏం జరిగిందో తెలియదంటున్న వైనం

విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే ఘటన

సాక్షి, విజయనగరం క్రైం: ఇంటికి వెళ్తానని చెప్పి హాస్టల్‌ నుంచి బయలుదేరిన  డిగ్రీ విద్యార్థిని తెల్లారేసరికి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో రోడ్డుపక్కన పొదల్లో బందీగా కనిపించింది. విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సోమవారం వేకువజామున ఈ ఘటన వెలుగు చూసింది. జాగింగ్‌కు వెళ్లిన కొందరు యువకులు ఆ యువతిని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి విజయనగరంలోని ప్రైవేట్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ ఫైనలియర్‌ చదువుతోంది. అనారోగ్య కారణాల వల్ల తన స్వగ్రామానికి వెళ్తానని వార్డెన్‌కు చెప్పిన ఆ యువతి శనివారం సాయంత్రం కళాశాలలోని హాస్టల్‌ నుంచి బయలుదేరింది.

ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా రాజాం మీదుగా తన ఊరెళ్లేందుకు ఓ ప్రైవేటు వాహనం ఎక్కింది. ఆ తరువాత ఏమైందో గానీ సుమారు 36 గంటల తరువాత సోమవారం తెల్లవారుజామున గుర్లలో అంతుచిక్కని పరిస్థితుల్లో కనిపించింది. ఆ మార్గంలో జాగింగ్‌ చేస్తున్న వారికి పొదల్లోంచి మూలుగులు వినబడటంతో వెళ్లి చూడగా ఓ యువతి అచేతన స్థితిలో కనిపించటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె చేతులు, కాళ్లకు ఉన్న కట్లను విప్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ పి.అనిల్‌కుమార్, సీఐ మంగవేణి విచారణ చేసినప్పటికీ ఆ యువతి నోరు విప్పలేదు. యువతి షాక్‌కు గురవ్వడం వల్ల నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

స్నేహితులతో ఆటోలో..
యువతి ప్రైవేట్‌ వాహనంలో ఎక్కడకు వెళ్లిందన్న విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. విజయనగరంలోని ప్రధాన కూడళ్లలో గల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. శనివారం సాయంత్రం బస్‌ కాంప్లెక్స్‌ వద్ద ఆ యువతి ప్రైవేటు వాహనం ఎక్కి కోట వద్ద దిగిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. అక్కడి నుంచి స్నేహితులతో కలిసి ఓ ఆటోలో గుర్ల వరకు ప్రయాణించినట్టు గుర్తించామని చెప్పారు. 2016లో ఆ యువతి అదృశ్యమైనట్టు ఫిర్యాదు రాగా.. హైదరాబాద్‌లో కనుగొని తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. తనకు మూర్ఛ రోగం ఉండటంతో ఏమీ గుర్తుకు రావడం లేదని ఆ యువతి చెబుతోందన్నారు. విచారణను వేగవంతం చేసి అసలు విషయాన్ని తెలుసుకుంటామన్నారు.

రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
ఇదిలావుండగా.. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని, రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపిస్తున్నామని అదనపు ఎస్పీ ఎన్‌.శ్రీదేవీరావు తెలిపారు. బాధిత యువతి ప్రతి వారం కాళీ ఘాట్‌ కాలనీలో ఉంటున్న చిన్నాన్న ఇంటికి వెళ్తుంటుందని చెప్పారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, వైద్యులు నుంచి అందే నివేదికల  ఆధారంగానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆయన వెంట దిశ డీఎస్పీ త్రినాథ్‌ ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top