ఇంటికి తాళం వేయడంతో యజమాని బలవన్మరణం
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో ఘటన
యలమర్రు (పెదపారుపూడి): ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఒకరి నిండు ప్రాణం బలితీసుకుంది. అప్పు తీర్చలేదని ఇంటికి తాళం వేసి, నోటీసులు అంటించటంతో మనస్తాపం చెందిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యలమర్రు గ్రామానికి చెందిన గేదల హరిఓం ప్రసాద్ (44), స్వప్న దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ వ్యవసాయ పనులకు వెళ్తుంటాడు. రెండేళ్ల కిందట ఇంటి నిర్మాణం కోసం ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. కొంత కాలం నుంచి వాయిదాలు చెల్లించకపోవడంతో కంపెనీ పలుసార్లు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో కంపెనీ వాళ్లు గురువారం ఉదయం అధికారులను తీసుకుని గ్రామానికి వచ్చారు. ప్రసాద్ ఇంటికి తాళాలు వేసి తలుపునకు నోటీసులు అంటించారు. దీంతో హరిఓం ప్రసాద్ కుటుంబ సభ్యులతో పొరుగున ఉన్న ఈదులమాద్దాలి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు.
హరిఓం ప్రసాద్ రాత్రి 10 గంటలకు యలమర్రు వెళ్తున్నట్లు భార్య స్వప్నకు చెప్పి బయలుదేరాడు. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో గ్రామంలో ఉన్న రామాలయం గేటుకు ఉరేసుకుని వేలాడుతున్న హరిఓం ప్రసాద్‌ను చూసి గ్రామస్తులు స్వప్నకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


